రిసార్ట్ రాజకీయం
76 మంది కాంగ్రెస్
కార్పొరేటర్లు మడికేరికి తరలింపు
ఈ నెల 11నబెంగళూరుకు తిరిగిరాక
తాయిలాలకు ఆశ పడొద్దని సీఎం హితబోధ
బెంగళూరు: మేయర్ ఎన్నిక మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తన కార్పొరేటర్లు చేజారి పోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కార్పొరేటర్లను రిసార్టుకు తరలించింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 24 సీట్లు తక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే 14 సీట్లు వచ్చిన జేడీఎస్‌తో, 7 స్థానాల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠంపై కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి ఆపరేషన్ కమల పేరుతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 10 మందికి కొన్ని కానుకలు కూడా ముట్టజెప్పడానికి సిద్ధపడిందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.
దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన 76 మంది కార్పొరేటర్లను బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయానికి సోమవారం ఉదయమే పిలిపించుకున్నారు. అందరూ కలసికట్టుగా ఉండాలని బీజేపీ చూపించే కొన్ని కానుకల కోసం రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టకండని హితబోధ చేశారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు కార్పొరేటర్లను మూడు ప్రత్యేక బస్సుల్లో మడికేరికి తరలించారు. అక్కడి క్లబ్ మహీంద్ర, తాజ్ రిసార్ట్‌లలో వారు మూడు రోజుల పాటు ఉండి మేయర్ ఎన్నిక జరిగే ఈ నెల 11న బెంగళూరుకు రానున్నారు. ఈ రిసార్టు రాజకీయ ఘట్టానికి ఎమ్మెల్యేలైన ఎస్.టీ సోమశేఖర్, భైరతిభసవరాజ్, మునిరాజ్‌లు నేతృత్వం వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భేషరతుగా మద్దతు
రాజకీయ రిసార్ట్ ఘట్టం ప్రారంభం కావడానికి ముందు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ కుమారస్వామి బెంగళూరులోని విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. ‘బీబీఎంపీ మేయర్ పదవి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకు భేషరతుగా మద్దతు ప్రకటించాం. కాంగ్రెస్ పార్టీనే మాకు ఉపమేయర్ పదవి ఇవ్వడానికి అంగీకరించింది. ఇక ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే మేయర్ పదవిలో ఉండాలా లేదా అన్న విషయం బీబీఎంపీ పరిధిలోని జేడీఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా.’ అని పేర్కొన్నారు.