విజయనగరం: ప్రేమించిన యువకుడితోనే తన పెళ్లి జరిపించాలని కోరుతూ ఓ యువతి నిరాహార దీక్షకు కూర్చుంది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన దొనక రోహిణి(20), తాపీ మేస్త్రీగా పని చేస్తున్న వరప్రసాద్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమెకు వరప్రసాద్ అబార్షన్ చేయించాడు.
రోహిణి పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ వర ప్రసాద్ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇటీవల గట్టిగా నిలదీయగా ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వరప్రసాద్‌కు స్థానిక టీడీపీ నేతలు కొమ్ముకాయటంతో రోహిణి ఫిర్యాదును పోలీసులు పట్టించుకో లేదు. దీంతో విసిగిపోయిన రోహిణి వారం క్రితం పోలీస్‌స్టేషన్‌లోనే పురుగు మందు తాగేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను వారించి నచ్చ చెప్పి ఇంటికి పంపారు.
తనకు న్యాయం దక్కేలా లేదని భావించిన బాధితురాలు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు పూనుకుంది. వరప్రసాద్‌తోనే తనకు వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఆమెకు బీజేపీ, సీపీఎం, ఐద్వా, సీఐటీయూ తదితర ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి.