ఇక బెటర్‌మెంట్!
- చార్జీల వసూలుకు బీబీఎంపీ శ్రీకారం
- భూ పరివర్తన ఆమోదం పొందిన నివేశనాలకు మాత్రమే
- చార్జీల మొత్తాన్ని కంతుల రూపంలో చెల్లించే వెసులబాటు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలో రెవెన్యూ స్థలాల్లోని నివేశనాలకు తక్షణమే బెటర్‌మెంట్ ఛార్జీలను వసూలు చేపట్టాలని రెవెన్యూ, సహాయ రెవెన్యూ అధికారులను పాలికె కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సర్క్యులర్‌ను జారీ చేశారు. నగరంలో రెవెన్యూ స్థలాల్లోని క్రమబద్ధీకరణ పొందని (బీ ఖాతా) నివేశనాల నుంచి బెటర్‌మెంట్ ఛార్జీలను వసూలు చేస్తారు.
క్రమబద్ధీకరణ పొందిన నివేశనాలను ‘ఏ’ ఖాతాలుగా పరిగణిస్తారు. ఇళ్లు కట్టుకోవడానికి ఇలాంటి ‘ఏ’ ఖాతాలకు మాత్రమే బ్యాంకులు రుణాలిస్తాయి. ‘బీ’ ఖాతా స్థలాలకు రుణ సౌలభ్యం ఉండదు. నగరంలో ఎన్నో ఎకరాల్లో ఇలాంటి ‘బీ’ ఖాతాలున్నాయి. బెటర్‌మెంట్ ఛార్జీలను చెల్లించడం ద్వారా ‘ఏ’ ఖాతాలను పొందడానికి చకోర పక్షుల వలే ఎదురు చూస్తున్న వారికి ఈ సర్క్యులర్ ద్వారా ఉపశమనం కలుగనుంది.
బెటర్‌మెంట్ ఛార్జీల కింద బీబీఎంపీలో పరిధిలో 2007లో కొత్తగా చేరిన వార్డుల్లో చదరపు మీటరుకు రూ.250, పాత బీఎంపీ పరిధిలోని వంద వార్డుల్లో రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. బెటర్‌మెంట్ ఛార్జీలను స్వీకరించడానికి ముందు యాజమాన్య హక్కులను ఓ సారి పరిశీలించాలని
రెవెన్యూ అధికారులకు కమిషనర్ సూచించారు. వ్యవసాయేతర వినియోగానికి భూ పరివర్తన ఆమోదం పొందిన నివేశనాలకు మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు.
భూ పరివర్తన పొందని నివేశనాలకు బెటర్‌మెంట్ ఛార్జీలు వసూలు చేయడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఛార్జీల మొత్తాన్ని కంతుల్లో చెల్లించడానికి కూడా అవకాశం ఉందని, దీనికి సంబంధించి గత ఏడాది జనవరి 5న జారీ చేసిన సర్క్యులర్‌లోని నియమాలను అనుసరించి ఈ అవకాశాన్ని కల్పించాలని సూచించారు.
భూ పరివర్తన ఆమోదం పొంది, భాగాలు పంచుకోని ఏక నివేశనాలు, భాగాలు పంచుకుని, వాటిల్లో నిర్మించబోయే కట్టడాల బ్లూప్రింట్లకు బీడీఏ అనుమతి పొందిన నివేశాలు, కేఐఏడీబీ, కేఎస్‌ఎస్‌ఐడీసీ, కేహెచ్‌బీలు ఏర్పాటు చేసిన పారిశ్రామిక-గృహ లేఔట్లలో పౌర సదుపాయాలు కల్పించని లేఔట్లు, కర్ణాటక భూ రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 94(సీ) ప్రకారం క్రమబద్ధీకరించుకుని, ఖాతాలను కోరుతున్న నివేశనాలకు బెటర్‌మెంట్ ఛార్జీలను కట్టించుకోవచ్చని కమిషనర్ సూచించారు.