చిత్తూరు: చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు చెందిన కంపెనీలపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి దాదాపు రూ.300 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. బుధవారం బెంగళూరులో ఐటీ అధికారులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇందులో బెంగళూరులోని వైదేహీ, మాల్యా ఆసుపత్రుల్లో దాడులు చేయగా దాదాపు రూ.265 కోట్ల ఆస్తులకు సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు వారు తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆమె కంపెనీలు, ఇళ్లలో జరిగిన సోదాల్లో ఎమ్మేల్యేకు సంబంధించిన విద్యా సంస్థల నుంచి దాదాపు రూ.43 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. 13 సంవత్సరాల ఆదాయ ఖర్చుల వివరాలు తెలపాల్సిందిగా అధికారులు ఆమెను ఆదేశించారు.