వీరరాఘవుని ఆలయంలో భక్తుల రద్దీ
Published Sat, Oct 5 2013 6:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: మహాలయ అమావాస్య సందర్భంగా వీరరాఘవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పెరటాసి నెలలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా భావించి భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తుంటారు.
ఇందులో భాగంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రి నుంచే భక్తులు రాక మొదలైంది. ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఇదిలావుండగా గురువారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదు కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రైల్వేస్టేషన్, బస్టాండు, పెట్రోల్‌బంక్ తదితర ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం వీరరాఘవుని సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించి తమ పితృదేవతలకు పిండాలు ప్రదానం చేశారు. అనంతరం బెల్లం, పాలు, ఉప్పు తదితరాలను పుష్కరిణిలో వదిలి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాంచీపురం, వేలూరు, చెన్నై, ఆంధ్రా, కేరళ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
Advertisement