ఠాణే, నగర పరిసరాల్లో డబ్బులు వసూలు చేస్తున్న టోల్ ప్లాజాలపై పునరాలోచించాలని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్....
సీఎం ఫడ్నవీస్‌కు భారత మాజీ క్రికెటర్ సచిన్ లేఖ
సాక్షి, ముంబై: ఠాణే, నగర పరిసరాల్లో డబ్బులు వసూలు చేస్తున్న టోల్ ప్లాజాలపై పునరాలోచించాలని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. టోల్ చెల్లించలేక వాహన చోదకులు సతమతమవుతున్నారని, ఇదివరకే అనేక ఆందోళనలు జరిగాయని, ఇకనైనా బీజేపీ ప్రభుత్వం దృష్టిసారించాలని సచిన్ విజ్ఞప్తి చేశారు. ‘‘న వీముంబై, ఠాణే నుంచి నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు ముంబైకి వస్తుంటాయి.
ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో నగరానికి వచ్చే రహదారులపై టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ ఉంటోంది. ప్రజల విలువైన సమయం, ఇంధనం వృథా అవుతోంది. ప్రజలు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టోల్ వసూళ్లపై మరోసారి ఆలోచించాలి’’ అని సచిన్ లేఖలో కోరారు. కాగా రాజ్యసభకు ఎన్నికైన తరువాత ప్రజల సమస్యలపై సచిన్ స్పందించడం ఇదే ప్రథమం. కాగా, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి దివాకర్ రావుతే సచిన్ వైఖరిపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు.
టోల్‌పై గళమెత్తిన సచిన్‌కు విదర్భలో రైతుల ఆత్మహత్యలు కనిపించలేదా..? వారి గురించి ప్రస్తావించాలని అనిపించలేదా..? అని ప్రశ్నించారు. సచిన్ లేఖపై దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం టోల్ యజమానులకు లబ్ధి చేకూర్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. బీజేపీ, శివసేన ప్రభుత్వం దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, త్వరలో వాహన యజమానులకు టోల్ నుంచి విముక్తి కల్గించే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.