‘కంచి’ కలకలం, నిత్యానంద శిష్యులకు వార్నింగ్!
►రూ.2వేల కోట్ల ఆస్తుల కోసమేనని అనుమానం
►నిత్యానంద శిష్యులకు పోలీస్ హెచ్చరిక
►క్షేమంగా ఉన్నానని మఠాధిపతి ఫోన్
చెన్నై: కోట్లాది రూపాయల ఆస్తులు ఎవరికి చేదు అన్నట్లుగా కాంచీపురం మఠం కలకలం రేపింది. మఠాధిపతి కిడ్నాప్ అంటూ పోలీసుల కేసు, బెంగళూరులో క్షేమంగా ఉన్నానంటూ మఠాధిపతి పోలీసులకు ఫోను, ఆస్తికోసం మొదలియార్ల నాటకమని ఆరోపణలు. కథలన్నీ కంచి చేరుతాయనే జాతీయంలా ఆది, సోమవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలకు కొత్త కథను పరిచయం చేశాయి. కంచిలోని ఓ మఠానికి సంబంధించిన వ్యవహారం తమిళనాడులో రెండు రోజుల పాటు పెద్ద కలకలాన్ని రేపింది. సోమవారం సాయంత్రానికి కొత్త మలుపుతిరిగింది. కాంచీపురం పరమశివన్ వీధిలో తొండమండల మొదలియార్ సామాజికవర్గానికి చెందిన పురాతనమైన జ్ఞానప్రకాశ మఠం ఉంది.
వంశపారంపర్యం నిర్వహణలోని ఈ మఠం 232 వ మఠాధిపతిగా 2008 నుంచి జ్ఞానప్రకాశ దేశిక పరమాచార్య స్వామి వ్యవహరిస్తున్నారు. ఈ మఠానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. బెంగళూరుకు చెందిన నిత్యానంద శిష్యులు (ఒక పురుషుడు, ఒక స్త్రీ) రెండునెలల క్రితం మఠానికి చేరుకుని సేవలతో తరిస్తామంటూ స్వామి పంచనచేరారు.
మఠంలోని మరకత శివలింగానికి సహజంగా ఆచరించే పారంపర్యపూజ విధానాన్ని నిత్యానంద శిష్యులు మార్చివేశారు. అంతేగాక మఠానికి వచ్చే భక్తులను ఆశీర్వదించడం తదితర నిర్వాకానికి పాల్పడుతూ మఠంపై పథకం ఆధిపత్యానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయాన్ని మండల మొదలియార్ల సంఘం నిర్వాహకులు మఠాధిపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాల గురించి చర్చించేందుకు రావాల్సిందిగా మఠాధిపతి సంఘం నేతలకు కబురు పంపారు.
ఈ క్రమంలో మొదలియార్ల సంఘంతో మఠాధిపతి సోమవారం చర్చలు జరపాల్సి ఉంది. మఠాధిపతి అదృశ్యం ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం మొదలియార్ సంఘం నేతలు వెళ్లి చూడగా మఠం తలుపులు మూసిఉన్నాయి. మఠాధిపతి కనిపించలేదు. మఠా«ధిపతి నిత్యం వినియోగించే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కీడు శంకించిన సంఘం నేతలు కాంచీపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదుచేశారు. మఠాధిపతిని నిత్యానంద శిష్యులు కిడ్నాప్‌చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మఠంలో చోటుచేసుకున్న పరిణామాలను ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం, ఆదివారం ఉదయం మఠం తలుపులకు బయటివైపు నుంచి తాళం వేసి ఉంది. సోమవారం ఉదయం లోపలివైపు గడియపెట్టి ఉంది.
మఠం లోపల పదిమందికి పైగా నిత్యానంద శిష్యులు ఉన్నట్లు ఇరుగుపొరుగు వారు మిద్దెల పైనుంచి చూసి నిర్ధారించారు. ఈ శిష్యగణమంతా కలిసి మఠంలో సోమవారం ఉదయం పూజలు కూడా నిర్వహించాని చెప్పారు. మఠానికి చేరుకున్న పోలీసులు అక్కడి నిత్యానంద శిష్యులను విచారించారు. మూడు రోజుల్లోగా మఠాన్ని, మఠాధిపతిని అప్పగించాలని లేని పక్షంలో అరెస్టులు తప్పవని హెచ్చరించారు.
నేనే వెళ్లా..
మఠాధిపతి కనపడటం లేదని కొందరు, కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదులతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చించుకోవడం ప్రారంభించారు. సోమవారం నాటి తమిళ సాయంకాల దినపత్రికల్లో ప్రముఖంగా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. కాంచీపురంలోని కలకలం బెంగళూరులో ఉన్న మఠాధిపతి చెవినపడింది. ఆయన వెంటనే కాంచీపురం పోలీసులకు ఫోన్‌చేసి క్షేమ సమాచారం ఇచ్చారు. నిత్యానంద శిష్యులను వెంటబెట్టుకుని తన ఇష్టపూర్వకంగానే బయలుదేరానని, ప్రత్యేక పూజల నిమిత్తం బెంగళూరులో ఉన్నానని పోలీసులకు తెలిపారు. మఠానికి చెందిన ఆస్తులను కాజేసేందుకు మొదలియార్ల సంఘం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ కిడ్నాప్ ఉదంతమని మఠాధిపతి పోలీసులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఈ సంఘటనపై మొదలియార్ సంఘం నేతలు మాట్లాడుతూ, పారంపర్యానికి చెందిన ఈ మఠానికి సుమారు రూ.2వేల కోట్ల ఆస్తులను అపçహరించేందుకు నిత్యానంద శిష్యులు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. మఠం ఏ ఒక్కరి వ్యక్తి సొత్తు కాదని, మఠాన్ని తమ సంఘానికి లేదా ప్రభుత్వానికి గానీ అప్పగించాలని మఠాధిపతిని డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.