చెరుకు రైతుల గోడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెట్టుబడి పెరిగిన దృష్ట్యా పంటకు మద్దతు ధర పెంచమని....
= చెరుకు రైతుల గోడు పట్టించుకోని సర్కార్
=రూ. 2500 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం
= అంగీకరించిన చక్కెర ఫ్యాక్టరీ యజమానులు
= రూ. 3,500 చెల్లించాల్సిందేనని రైతు సంఘం పట్టు
సాక్షి,బెంగళూరు: చెరుకు రైతుల గోడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెట్టుబడి పెరిగిన దృష్ట్యా పంటకు మద్దతు ధర పెంచమని రాష్ట్ర చెరుకు రైతులు వాపోతున్నా ‘చెవిటి వాడి ముందు శంఖం ఊదిన’ చందంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన సహచర మంత్రులు ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరుకు మద్దతు ధర పెంచమని చెరుకు రైతులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారమే గత ఏడాది కంటే ఈ సంవత్సరం చెరుకు పంటకు 25 శాతం పెట్టుబడులు పెరిగాయి. దీంతో ఈ ఏడాది చెరుకు ఉత్పత్తికి ప్రతి రైతు టన్నుకు రూ.2,700 నుంచి రూ.2,800 ఖర్చు చేశారు. ఈ క్రమంలో మద్దతు ధర టన్నుకు రూ.3,500 చెల్లించాలని కోరుతూ దాదాపు పది రోజులుగా చెరుకు రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం ‘కృష్ణా’లో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన చక్కెర ఫ్యాక్టరీ యజమానులు, చెరుకు రైతుల సంఘం ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమావేశం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...
ఈ సమావేశంలో ఈ ఏడాది ప్రతి టన్నుకు రూ.2,500 మద్దతు ధరగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అటు చక్కెర ఫ్యాక్టరీ యజమానులు కాని ఇటు రైతు సంఘం నాయకులు కానీ ఒప్పుకోలేదు. గత ఏడాది కంటే బయటి మార్కెట్‌లో చక్కెర ధర తగ్గిందని అంతేకాకుండా చెరుకు ఉప ఉత్పత్తులకు సరైన ధర దక్కడం లేదంటూ సాకులు చెబుతూ చెరుకు ఫ్యాక్టరీ యజమానులు టన్ను చెరుకుకు రూ.2,400 మాత్రం చెల్లించడానికి ముందుకురాగా,
అంత తక్కువ ధరకు పంటను అమ్మితే పెట్టుబడులు కూడా తిరిగి రావని పేర్కొంటూ రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో మొదటి దఫా చర్చలు విఫలమయ్యాయి. తర్వాత సీఎం సిద్ధరామయ్య ఎలాగైనా సరే ఈ చర్చలను ఒక కొలిక్కి తెచ్చి సాయంత్రం లోపు చెరుకు పంటకు మద్ధతు ధర నిర్ణయించాలని మంత్రులకు, అధికారులకు సూచించారు. దీంతో రెండోవిడత చర్చలు విధానసౌధలో జరిగాయి. ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ
యజమానులను, రైతు సంఘం నాయకులతో విడివిడిగా చర్చలు జరిపిన ప్రభుత్వం చివరికి టన్నుకు చెరుకు ఫ్యాక్టరీ యజమానులు రైతులకు రూ.2,500 చెల్లించేటట్లు ఒప్పుకున్నారు. అయితే ఇందుకు గాను చక్కెర కర్మాగారాల యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.300 కోట్లు రద్దు చేసేటట్లు ఒప్పందం కుదిరింది. కాగా, చర్చల్లో పాల్గొన్న సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది చెరుకుకు మద్దతు ధర టన్నుకు రూ.2,500 నిర్ణయించామని తెలిపారు.
అయితే ప్రభుత్వ నిర్ణయించిన ధరకు తమ పంటను అమ్ముకోలేమని రైతు సంఘం నాయకులు పేర్కొంటూ చర్చల నుంచి బయటకు వచ్చేశారన్నారు. ఈ విషయమై రాష్ట్ర చెరుకు రైతుల సంఘ అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ మీడియాతో మాట్లాడుతూ... పెట్టుబడులు పెరిగిన దృష్ట్యా ప్రతి టన్నుకు రూ.3,500 చెల్లించాల్సిందేన న్నారు.
అంతవ రకూ తమ పోరాటం ఆగదన్నారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరుకు రైతులు సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి రైతు సంఘం నాయకుల్లో మద్దతు ధరపై భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. కొంతమంది ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించగా మరికొందరు మాత్రం ఒప్పుకోక తమ పోరాటాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు.