► మృతుల కుటుంబాలకు సాయం
►166 మందికి తలా రూ. మూడు లక్షలు
► ఇద్దరికి వైద్యఖర్చులకు రూ. లక్ష
► అమ్మ సమాధి వద్ద మరో వృద్ధురాలు ఆత్మహత్య
అమ్మ జయలలిత మరణ సమాచారం తో గుండెలు ఆగి, బలవన్మరణాలతో విగతజీవులైన వారి కుటుంబాలను చిన్నమ్మ శశికళ ఓదార్చారు. తొలి విడతగా 166 మంది కుటుంబాలకు తలా రూ.3 లక్షలు చొప్పున సాయం అందించారు. ఇదిలా ఉంటే మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్ద ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలు మరణించారు.
సాక్షి, చెన్నై: తమిళుల అమ్మ, దివంగత సీఎం జయలలిత ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న విషయం తెలి సిందే. ఆందోళన వద్దంటూ పార్టీ వర్గాలు భరో సా ఇస్తూ వచ్చినా, కేడర్‌లో మాత్రం ఉత్కంఠ తప్పలేదు. తమ ముందుకు మళ్లీ వస్తారనుకున్న అమ్మ ఇక లేరన్న సమాచారంతో వందలాది గుండె లు పగిలాయి. మరెందరో బలవన్మరణాలకు పాల్ప డ్డారు. అమ్మ మరణం తట్టుకోలేక గుండెలు ఆగి, ఆత్మహత్యలతో ఐదు వందల మందికి పైగా మరణించినట్టు అన్నాడీఎంకే కార్యాలయం స్పష్టం చేసింది. వీరి కుటుంబాల్ని ఆదుకునే విధంగా తలా రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు.
ఓదార్పు
అమ్మ లేరన్న సమాచారంతో మరణించిన వారి కుటుంబాల్ని ఓదార్చేందుకు చిన్నమ్మ శశికళ నిర్ణయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాతో రాయపేటలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబాల్ని చిన్నమ్మ ఓదార్చారు. సానుభూతి తెలియజేయడంతోపాటుగా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. తొలి విడతగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కడలూరు, విల్లుపురం, సేలం, పెరంబలూరు, అరియలూరు, మధురై జిల్లాల్లోని 166 మంది బాధిత కుటుంబాలకు తలా రూ.3 లక్షలకు చెక్కులను అందజేశారు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు తలా రూ.50 వేలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నమ్మ తమ మీద అమ్మ ప్రేమ చూపించి ఆదుకున్నారని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమై, కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఇక, పోయెస్ గార్డెన్ లో చిన్నమ్మ శశికళను రాష్ట్రానికి చెందిన బాస్కెట్ బాల్, రగ్బీ క్రీడాకారులు కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
సమాధి వద్ద ఆత్మహత్య: చెన్నై మెరీనా తీరంలో దివంగత సీఎం జయలలిత శాశ్వత నిద్రలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యం వేలాది మంది తరలి వచ్చి అమ్మ సమాధిని దర్శించుకుంటూ వెళ్తున్నారు. అమ్మ మరణం తట్టుకోలేక తీవ్ర వేదనలో మునిగి స్పృహ తప్పే కార్యకర్తలు ఇక్కడ ఎక్కువే. అందుకే వారి కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ లను సైతం సిద్ధం చేసి ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వ్యాసార్పాడికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుటాహుటీన ఆసుపత్రికి తరలించి రక్షించారు. చిన్నమ్మ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ మరో మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి అమ్మ సమాధి వద్ద 60 ఏళ్ల వృద్ధురాలు స్పృహ తప్పారు. ఆమె నోట్లో నుంచి నురగలు రావడం, ఆమె చేతిలో క్రిమి సంహారక మందు బాటిల్ ఉండడంతో ఆగమేఘాలపై ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు మరణించింది. ఆమెకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించక పోవడంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచి ఉన్నారు.