శశికళపై పన్నీరు వర్గం ముప్పేట దాడి
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం అన్నా డీఎంకే చీఫ్ శశికళపై ముప్పేటదాడిని ముమ్మరం చేసింది. శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు, పోయెస్ గార్డెన్ నుంచి ఆమెను వెళ్లగొట్టేందుకు పన్నీరు సెల్వం ఎవరూ ఊహించని విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తుండగా, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా ఆమెను తొలగించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతూ ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మొదట్నుంచి శశికళ శిబిరం వైపు ఉన్న మధుసూదన్ ఆమెకు ఝలక్ ఇచ్చి పన్నీరు సెల్వం గూటికి చేరిన సంగతి తెలిసిందే.
పార్టీ నియమావళి ప్రకారం ప్రధాన కార్యదర్శి కావాలంటే పార్టీలో ఐదేళ్ల పాటు సభ్యత్వం కలిగి ఉండాలని ఈసీకి రాసిన లేఖలో మధుసూదన్ పేర్కొన్నారు. శశికళ 2012 మార్చిలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా ఐదేళ్లు పూర్తికాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. శశికళ ఎన్నికను తప్పుబడుతూ ఇటీవల ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఈసీ వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అన్నా డీఎంకేను ఆదేశించింది. తాజాగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ హోదాలో మధుసూదన్ లేఖ రాయడం శశికళకు సమస్యగా మారింది.