మరో 11మంది వెళితే శశికళ కల కల్లాస్!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు, ఆమె వర్గానికి టెన్షన్ పుట్టించే వాతావరణం మొదలైంది. ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు మరింత తగ్గిపోతున్నాయి. మరో 11మంది ఎమ్మెల్యేలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి జై అంటే ఇక ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం కష్టతరంకానుంది. రోజురోజుకి శశికళ వర్గం నుంచి ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ జారుకుంటూ సెల్వంతో చేతులు కలుపుతున్న విషయం తెలిసిందే.
మొత్తం 10మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఇప్పటికే పన్నీర్ సెల్వాన్ని ఆయన నివాసం వద్ద కలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు నేరుగా ఉంది. అయితే, ఇది కాస్త 18కి పెరిగితే శశికళ వర్గం ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం కష్టమే అని అంటున్నారు. ఒక్క ఆదివారం ఐదుగురు ఎంపీలు సెల్వాన్ని కలుసుకొని ఆయనకు మద్దతిచ్చారు. అంతకుముందు రోజు నలుగురు లోక్‌సభ సభ్యులు కలిసి మద్దతిచ్చారు.
అలాగే, రామరాజన్ వంటి ప్రముఖ నటులు కూడా సెల్వానికి జై అన్నారు. దీంతో ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే ఆయన ఇంటి వాతావరణం బాజాలు, పటాసులతో మారిమోగిపోతుందంట. తమిళనాడు మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 235. ప్రస్తుతం జయలలిత చనిపోవడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ప్రస్తుతం 117 మ్యాజిక్ ఫిగర్ కావాలి.
శశికళ మాత్రం 131మంది ఎమ్మెల్యేలు కూడా తనతోనే ఉన్నారని అంటున్నారు. అయితే, ప్రస్తుతం పన్నీర్‌కు 7గురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆయనతో కలిపితే ఎనిమిది. ఇది ఇలాగే కొనసాగితే, శశికళ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి భంగం వాటిల్లదు. కానీ, మరో పదకొండు మంది ఎమ్మెల్యేలు సెల్వం వైపు వస్తే మాత్రం శశి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేరు. అలాంటి పరిస్థితే వస్తే తమిళ రాజకీయం మరింత ఆసక్తిగా మారడం ఖాయం. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే మొత్తం 135 స్థానాలను దక్కించుకుంది.
తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు
డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!
శశి నుంచి మా మంత్రిని కాపాడండి!
అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!