కాసేపట్లో గవర్నర్ ప్రకటన
చెన్నై: తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితిపై ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కాసేపట్లో ప్రకటన చేసే అవకాశముంది. శుక్రవారం మధ్యాహ్నం విద్యాసాగర్ రావు.. చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్‌ను రాజ్భవన్‌కు పిలిపించుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు. పన్నీరు సెల్వం రాజీనామా, ఆ తర్వాత అధికార అన్నా డీఎంకేలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ఏర్పాటు విషయంపై గవర్నర్ చర్చించారు.
ఎమ్మెల్యేలను శశికళ వర్గం బలవంతంగా తీసుకెళ్లి నిర్బంధించిందని పన్నీరు సెల్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంతకుముందు గవర్నర్ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమావేశమయ్యారు. శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. దీంతో క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు డీజీపీ బయల్దేరారు. ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత గవర్నర్ వారి అభిప్రాయాలను తెలుసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముంది. గవర్నర్ నిర్ణయం కోసం సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తనతో శశికళ వర్గం బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిందని, ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని ఆపద్ధర్మముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గవర్నర్ను కోరాగా.. తనకే ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శశికళ గవర్నర్కు విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయంపై గవర్నర్ రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా లేక బలనిరూపణకు పన్నీరుకు అవకాశం ఇస్తారా లేక రాష్ట్రపతి పాలనకు సిఫారు చేస్తారా అన్నదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు!