=‘సీ ఓటర్’ అంచనాలతో కాంగ్రెస్ నేతల్లో గుబులు
=రాష్ర్టంలో అప్పుడే వ్యతిరేక పవనాలు
= లోక్‌సభ ఎన్నికలపై పెట్టుకున్న ఆశలు గల్లంతు
= కనీసం సగం స్థానాల్లోనూ గెలవలేని దుస్థితి
= ఫలితాలపై యూపీఏ-2 కుంభకోణాల ప్రభావం
= అదుపు తప్పిన ధరలపై ఓటరు మరింత ఆగ్రహం
= అప్పను చేర్చుకుంటే... బీజేపీ గెలుపు ఖాయం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మొన్ననే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చి ఏడాదయ్యాక... అంటే వచ్చే మే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున పెద్దగా ప్రజా వ్యతిరేకత ఉండబోదని అంచనా వేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో కర్ణాటకపై పార్టీ పటిష్టమైన అంచనాలతో ఉంది.
అయితే ‘సీ ఓటర్’ సహకారంతో ‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టీవీ’లు నిర్వహించిన ఎన్నికల సర్వేలో అధికార కాంగ్రెస్ మొత్తం 28 స్థానాలో సగం గెలుచుకోవడమూ గగనమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడే కనుక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 12, జేడీఎస్‌కు మూడు స్థానాలు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకులతో భేటీ అయినప్పుడు 25 స్థానాలను గెలుచుకుని తీరాలని దిశా నిర్దేశం చేశారు.
బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వేరు పడడం, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ బలహీనంగా కనిపించండ లాంటి పరిణామాలతో ఉపాధ్యక్షుడు నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా పూర్తి చేస్తామని రాష్ర్ట నాయకులు ధీమా కనబరుస్తూ వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుండడంతో ప్రస్తుతం గుబులు చెందుతున్నారు.
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అన్నట్లు ఏ అవినీతి నినాదంతో కాంగ్రెస్ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిందో, అదే నినాదం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పుట్టి ముంచేట్లు ఉందని పార్టీ నాయకులు కలత చెందుతున్నారు. బీజేపీ నాయకుల అవినీతిని పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో సొమ్ము చేసుకున్న కాంగ్రెస్‌కు అదే ప్రస్తావన తిరుగు బాణమై వచ్చి గుచ్చుకునేట్లుంది. కేంద్రంలోని యూపీఏ-2 కుంభకోణాలకు పర్యాయ పదంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు, అదుపు లేని పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు యూపీఏ సర్కారుపై ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల గడువు ఉన్నందున యూపీఏ సర్కారు మరింతగా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటుందనే విశ్లేషణలున్నాయి. అదే కనుక జరిగితే ప్రస్తుతం అంచనా వేస్తున్న స్థానాలు లభించడం కూడా దుర్లభమే.
అప్పను చేర్చుకుంటేనే బీజేపీ గెలుపు..
హాసన, మండ్య, బెంగళూరు గ్రామీణ స్థానాలు జేడీఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి. లింగాయత్‌లు ప్రాబల్యం కలిగిన ఉత్తర కర్ణాటకతో పాటు సంఘ్ పరివార్‌కు గట్టి పునాదులున్న కోస్తా తీరంలోని స్థానాల్లో విజయం సాధించడానికి బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను మచ్చిక చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బేషరతుగా పార్టీలో చేరాలన్న కమలనాథుల షరతును యడ్యూరప్ప సమ్మతించడం లేదు. పార్టీలో తనకు గౌరవప్రదమైన పదవిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక దశలో ఈ డిమాండ్‌ను కూడా పక్కన పెట్టి బీజేపీలో కేజేపీని విలీనం చేయడానికి ఆయన సిద్ధమైనా అనుయాయులు వారించారు. ‘వారికి మన అవసరం ఉందే తప్ప వారి అవసరం మనకు లేదు’ అని ఆయనను నిలువరించారు. ఏదో విధంగా యడ్యూరప్పను తమ దారికి తెచ్చుకోకపోతే బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందడం చాలా కష్టమవుతుంది. మొన్న శాసన సభ ఎన్నికల్లో పది శాతం ఓట్లను తెచ్చుకున్న కేజేపీని తక్కువగా అంచనా వేస్తే బీజేపీకే నష్టమనే రాజకీయ వాదనలున్నాయి.
విలీనం లేదు : యడ్డి
బీజేపీలో కేజేపీని విలీనం చేసే ప్రసక్తే లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. హుబ్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. పొత్తుపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని, ఒక వేళ పొత్తు కుదరక పోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదని కుండ బద్ధలు కొట్టారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది తన ఆశయమని, ఈ క్రమంలో ఎన్‌డీఏకు దగ్గర కావడానికి ప్రయత్నించానని తెలిపారు. ఇంతకు మించి ఎటువంటి బలహీనతలు, పదవీ కాంక్ష, అధికార వాంఛ తనకు లేదని స్పష్టం చేశారు.