పదిరోజుల్లో కొలిక్కి
కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై శరద్ పవార్
న్యూఢిల్లీ/కొల్హాపూర్:
కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు వివాదం పది రోజుల్లో పరిష్కారమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరుపార్టీల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. దీనిపై పవార్ పైవిధంగా స్పందించారు. ఇదే అంశంపై ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీట్ల సర్దుబాటు చర్చలను కాంగ్రెస్ ఆలస్యం చేస్తోందని, దీంతో తాము సహనం కోల్పోతున్నామని పటేల్ ఇటీవల అన్నారు. అంతేకాకుండా తమకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. అయితే పవార్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రఫుల్ ఎటువంటి అల్టిమేటం జారీ చేయలేదన్నారు. ‘మరో పది రోజుల్లో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వస్తుంది. చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్నాయి. కాం గ్రెస్ పార్టీకి ప్రఫుల్ పటేల్ ఎటువంటి అల్టిమేటం జారీ చేయలేదు’ అని పవార్ ఆదివారం ట్విట ర్‌లో పేర్కొన్నారు. దేశానికి సుస్థిర ప్రభుత్వం అవసరమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభావం ఉండబోదన్నారు.
ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో నష్టం
ఆచరణ సాధ్యం కాని డిమాండ్లు రాష్ట్రంలో చక్కెర పరిశ్రమకు హాని కలిగిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ హెచ్చరించారు. ఇలా అయితే ముంబైలో వస్త్ర పరిశ్రమలకు పట్టిన గతే వీటికి కూడా పడుతుందన్నారు. కొల్హాపూర్‌లో నిర్మించిన జాతీయ స్విమ్మర్ సాగర్ ప్రశాంత్‌పాటిల్ ప్రపంచశ్రేణి ఈతకొలనును ఆదివారం ప్రారంభిం చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డిమాండ్ చేయడం తప్పేమీకాదని, అతివాద నాయకత్వం ముంబైలో వస్త్ర పరిశ్రమలను నాశనం చేసిందన్నారు. ఇప్పుడు రాష్ర్టంలోని చక్కెర పరిశ్రమకు కూడా అదే జరిగితే మనమంతా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో చక్కె ర పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొం టోందన్నారు. ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాగా బీజేపీ, శివసేన నేతృత్వంలోని మహాకూటమిలో ఇటీవల చేరిన స్వాభిమాన్ శేత్కా ర సంఘటన్ సంస్థ చెరకును అత్యధిక ధరకు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో భారీ ఉద్యమం నిర్వహించిన విషయం విదితమే.