చెన్నై: టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు జె.శేఖర్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసి, సోమవారం రాత్రి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 28 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా సీబీఐ కేసులో శేఖర్ రెడ్డి సోమవారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి రాగానే ఆయన్ని ఈడీ సుమారు 10 గంటలపాటు విచారణ జరిపింది. శేఖర్ రెడ్డితో పాటు మరో ముగ్గుర్ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.
పెద్ద నోట్లు రద్దు తర్వాత ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) అధికారులు జరిపిన సోదాల్లో శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లలో రూ. 170 కోట్ల నగదు, 127 కిలోల బంగారం దొరికిన సంగతి తెలిసిందే. దీనిపై శేఖర్ రెడ్డిపై నేరపూర్వక కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద శేఖర్‌రెడ్డి సహా నలుగురిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ పై విడుదల అయిన శేఖర్ రెడ్డిని నిన్న ఈడీ అరెస్ట్ చేసింది.