సాక్షి ప్రతినిధి, చెన్నై: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డిసహా నలుగురిపై సీబీఐ, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. టీటీడీ పాలకమండలి బహిష్కృత సభ్యుడు శేఖర్‌రెడ్డితోపాటు ఆయన వ్యాపార భాగస్వాములైన ప్రేమ్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఇటీవల మెరుపు దాడులు చేసి భారీ ఎత్తున నగదు, కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐకి అప్పగించాలని ఆదాయపు పన్ను శాఖాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ సంస్థలు మంగళవారం కేసు నమోదు చేశాయి.