
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ వెనుకంజ !
సీఎం సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూరులో జిల్లా పంచాయతీని సొంతం చేసుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడింది.
బెంగళూరు: సీఎం సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూరులో జిల్లా పంచాయతీని సొంతం చేసుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడింది. 49 జెడ్పీ క్షేత్రాలున్న మైసూరులో కాంగ్రెస్ 22, జేడీఎస్ 18, బీజేపీ 8 క్షేత్రాలను సొంతం చేసుకున్నాయి. ఒక స్థానంలో స్వతంత్రులు గెలుపు సాధించారు. దీంతో మైసూరు జిల్లా పంచాయితీలో హంగ్ ఏర్పడింది. ఇదే సందర్భంలో 187 టీపీ క్షేత్రాలకు గాను 83స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 31 జేడీఎస్ 69, నాలుగు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. అంటే చాలా తక్కువ మెజారిటీ స్థానాలతోనే మైసూరు తాలూకా పంచాయతీల్లో సైతం కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక జిల్లా పంచాయతీకి సంబంధించిన పాలనా పగ్గాలను చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించని నేపథ్యంలో మైసూరులో జేడీఎస్, బీజేపీలు కూటమిగా ఏర్పడాలని భావిస్తున్నాయి. అయితే ఇంతకు ముందుగానే మైసూరులో జేడీఎస్, బీజేపీలు ముందుగానే అంతర్గత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా మైసూరులో బీజేపీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టిన కొన్ని జెడ్పీ క్షేత్రాల్లో జేడీఎస్ తన అభ్యర్థులనే పోటీకి నిలపలేదు. ఇక బీజేపీ, జేడీఎస్‌లు ముందుగా అంచనా వేసినట్లుగానే మైసూరులో ఓట్లను పోగు చేసుకోవడంలో కాంగ్రెస్‌వెనకపడింది. ఈ నేపథ్యంలో మెసూరులో కాంగ్రెస్ చేతికి జెడీప పాలనా పగ్గాలు అందకుండా చేసేందుకు బీజేపీ, జేడీఎస్ కూటమిగా ఏర్పడనున్నట్లు సమాచారం.