
శెట్టర్‌కు ఊరట
బెంగళూరు : భూ కేటాయింపుల అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌కు ఊరట లభించింది. బెంగళూరు మెట్రోపాలిటన్ టాస్క్ ఫోర్స్ (బీఎంటీఎఫ్)లో శెట్టర్‌పై జరుగుతున్న విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. జగదీష్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని శ్రీగంధ కావల్‌లో నాలుగు ఎకరాల భూమిని సుందరేషన్ అనే వ్యక్తికి కేటాయించారు.
కాగా ఈ కేటాయింపులు పూర్తిగా నియమ, నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయంపై బీఎంటీఎఫ్ విచారణను చేపట్టింది. ఈ విచారణను సవాల్ చేస్తూ జగదీష్ శెట్టర్ హైకోర్టును ఆశ్రయించారు. జగదీష్ శెట్టర్ దాఖలు చేసిన అర్జీపై వాదోపవాదాలు విన్న హైకోర్టు తమ తదుపరి ఉత్తర్వుల వరకు విచారణను నిలిపి వేయాల్సిందిగా బీఎంటీఎఫ్‌ను ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణను హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 4కు వాయిదా వేసింది.