ప్రయివేటు కంటైనర్ వెళ్లేందుకు అనుగుణంగా అధికారులు ఏడు గంటల పాటు విద్యుత్ ప్రవాహాన్ని నిలిపివేశారు.
తిరువళ్లూరు: ప్రయివేటు కంటైనర్ వెళ్లేందుకు అనుగుణంగా అధికారులు ఏడు గంటల పాటు విద్యుత్ ప్రవాహాన్ని నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే వరుసగా రెండో రోజు కూడా విద్యుత్‌ను కట్ చేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు సిప్కాట్ నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు కంటైనర్ మంగళవారం వెళ్లాల్సి వుంది. కంటైనర్ భారీ స్థాయిలో ఉండడంతో విద్యుత్ వైర్లకు తలుగుతుందన్న ఉద్దేశంతో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు.
కాగా సిప్కాట్ నుంచి తిరువళ్లూరు ఆవడి రోడ్డు వరకు వచ్చిన కంటైనర్‌ను అక్కడే నిలిపి వేశారు. అనంతరం బుధవారం ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి బయలు దేరిన కంటైనర్ సాయంత్రం నాలుగు గంటలకు ఐసీఎంఆర్‌ను దాటింది. ఈ కారణంగా బుధవారం సైతం దాదాపు ఏడు గంటల పాటు విద్యుత్‌ను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉండగా విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. జిరాక్స్‌షాపులు, రైస్‌మిల్స్ వ్యాపారులకు ఇబ్బందులు తప్పలేదు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ కంటైనర్ కోసమే కోత విధించామని తెలిపారు.