భయపడలేదు
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌తో నటించడానికి ఏ మాత్రం భయపడలేదని నటుడు ధనుష్ వ్యాఖ్యానించారు. రాంజనా చిత్రం తరువాత ఈయన హిందీలో నటిస్తున్న రెండో చిత్రం షమితాబ్. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు కమలహాసన్ రెండో కూతురు అక్షర హాసన్ కథా నాయకిగా పరిచయమవుతున్నారు. ఇంతకుముందు అమితాబ్‌తో పా, చీనికుం, శ్రీదేవి రీ ఎంట్రీ చిత్రం ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన బాల్కీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం షమితాబ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న తెరపైకి రానున్న ఈ చిత్రం గురించి వివరాలు వెల్లడించడానికి శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని సత్యభామ కళాశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో పాల్గొన్న నటుడు ధనుష్ మాట్లాడుతూ హిందీలో తన తొలి చిత్రం రాంజనా చిత్రం తరువాత మరో మంచి చిత్రం కోసం సుమారు 8 నెలలు వేచి ఉన్నానన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు బాల్కీ నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆయన చెప్పిన కథ వినగానే మరోమాట లేకుండా నటించడానికి అంగీకరించానని చెప్పారు. ఆ చిత్రమే ఈ షమితాబ్ అన్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ ప్రధాన పాత్రలను ధరించనున్నారని చెప్పగానే భయపడలేదు గానీ, ఆయనతో నటించడానికి చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూశానన్నారు. కారణం అమితాబ్ లాంటి గొప్ప నటుడి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చనే ఆశతోనేనన్నారు.
ఇక షమితాబ్ అంటే తన దృష్టిలో ఇళయరాజానేనన్నారు. అంత అద్భుతంగా ఆయనీ చిత్రానికి సంగీతాన్ని అందించారన్నారు. ఆయనతో నటించడం మధురమైన అనుభవంగా ధనుష్ పేర్కొన్నారు. నటి అక్షరతో నటించడం చక్కని అనుభూతిగా పేర్కొన్నారు. దర్శకుడు బాల్కీ మాట్లాడుతూ ధనుష్‌లో చాలా మంచి నటుడు ఉన్నాడని, ఆయన జాతీయ స్థాయి నటుడని పేర్కొన్నారు.అదృష్టం : నటి అక్షర మాట్లాడుతూ తొలి చిత్రం ఇంత భారీగా అమరడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. షమితాబ్ చిత్రంలో నటించడం ఆశ్చర్యంతో పాటు, సంతోషంగా ఉందన్నారు. చిత్రంలో ధనుష్ చాలా ఫవర్‌ఫుల్ పాత్రలో నటించారని అక్షర చెప్పారు.