
‘మన నిబంధనలతో మనమే దాడిచేశాం’
ముంబై: పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను శివసేన సమర్థిచింది. ఆజాద్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన నిజాలు మారిపోతాయా అని శివసేన అధికారిక పత్రిక సామ్న ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది. ఉడీ ఘటనలో 20 మంది జవాన్లు మృతి చెందితే.. నోట్ల రద్దుతో క్యూల కారణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారని సామ్న వెల్లడించింది. ఉడీలో జవాన్లపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేస్తే.. దేశంలోని సామన్యులపై మన నిబంధనలతో మనమే దాడులు చేశామని శివసేన పేర్కొంది.
ఉడీ ఉగ్రవాద దాడి మృతులకన్నా నోట్ల రద్దు మృతులే ఎక్కువని గురువారం రాజ్యసభలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఆజాద్ వ్యాఖ్యలు ‘దేశ వ్యతిరేకం’అని బీజేపీ పేర్కొంది. ఆజాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.