అటు చావులూ.. ఇటు సంగీతమా?
ముంబై: కళలు, క్రీడలపై తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిచజూసే శివసేన పార్టీ మరో వివాదానికి తెరలేపింది. ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు, పాకిస్థానీ అయిన ఉస్తాద్ గులామ్ అలీ.. ముంబైలో నిర్వహించనున్న సంగీతకచేరీని అడ్డుకుంటామంటూ శివసేన కార్యకర్తలు బుధవారం ఆందోళనలు నిర్వహించారు.
'ఓవైపు సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం భారతీయులను కాల్చిచంపుతుంటే.. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమిటి?' అంటూ నినాదాలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ' పాకిస్థాన్ తో క్రీడలైనా, సాంస్కృతి అంశమైనా, దౌత్యపరమైన చర్చలైనా ప్రతిదానినీ మేం వ్యతిరేకిస్తం. ఆ దేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంతవరకు మా వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదు' అన్నారు.
ఈ మేరకు కచేరీ జరగనున్న షణ్ముఖానంద్ హాల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం సాయంత్రం గులామ్ అలీ కచేరి ప్రారంభం కావాల్సిఉంది. అయితే శివసేన బెదిరింపులపై ఫడ్నవిస్ సర్కార్ ఇప్పటివరకు పెదవివిప్పలేదు. దీంతో గులామ్ అలీ కచేరీ నిరాటంకంగా జరుగుతుందా? లేదా అనే విషయంపై ఆయన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.