Ghulam Ali
-
వృత్తికి గులాం
గులాం అలీ ఖాన్ సూదీదారం పట్టుకుని యాభై ఏళ్లవుతోంది. ఇరవై మూడేళ్ల వయసులో మెడలో వేసుకున్న టేప్ ఇప్పటికీ ఉంది. చేతిలో కత్తెర మెత్తగా పని చేసుకుపోతూనే ఉంది. మెషీన్ చక్రం గిర్రున తిరుగుతూనే ఉంది. అది బతుకు చక్రం. జీవితాన్ని మలిచిన చక్రం. వృత్తిలో చక్రం తిప్పాడు గులాం. దుకాణం అంటే అన్నం పెట్టిన అమ్మ అంటాడు. దుకాణం తెరవని రోజు అమ్మను చూడని రోజేనంటాడు. అమ్మకు సలాం... వృత్తికి గులాం అంటున్నాడు హైదరాబాద్, హెచ్ఎఫ్ నగర్‌కు చెందిన ఈ సీనియర్ టైలర్. గులాం అలీ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా రాలేదేంటి అని అమ్మను అడుగుతున్నాడు. మాటల్లోనే వచ్చాడు నాన్న. అమ్మ చాయ్ ఇచ్చే వరకు ఉగ్గబట్టుకున్నాడు. ఆయన చాయ్ కప్పు కింద పెట్టగానే...‘‘నాన్నా నేను టైలరింగ్ నేర్చుకుంటా’’ ఉపోద్ఘాతం ఏమీ లేదు. విషయం చెప్పేశాడు గులాం అలీ.‘‘మనోళ్లలో ఎవరికీ రాదు బేటా, ఎక్కడ నేర్చుకుంటావ్’’‘‘దర్జీ దుకాన్కెళ్లి నేర్చుకుంటా అప్పా’’ ‘‘..........’’‘‘సరేనంటే రేపే వెళ్తా’’కొడుకు ఆరాటం అర్థమవుతోంది. ‘అలాగే’ అన్నాడు ముక్తసరిగా. గులాం అలీకి మెషీన్ మీద కూర్చున్నట్లే ఉంది. చక్రం గిర్రున తిరగడం, మెషీన్ టకటకలాడడం వింటుంటే తానే మెషీన్ కుడుతున్నట్లు ఉంది. షర్ట్ కుడుతున్న సీనియర్ వైపు తదేకంగా చూస్తున్నాడు. హెమ్మింగ్ చేసే నీడిల్ ఎడమ చేతి చూపుడు వేలిలో గుచ్చుకున్నది. ‘అబ్బా...’ అంటూ ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘ఏంట్రా! ఏ లోకంలో ఉన్నావ్’’ గద్దించాడు మాస్టర్.మాస్టర్ చేతిలోని కత్తెర వంపు తిరుగుతూ క్లాత్‌ను కట్ చేస్తుంటే ఆకాశంలో వంగిన ఇంద్రధనుస్సును చూసినంత సంబరంగా ఉంది గులాంకి. తానెప్పుడు అలా కట్ చేసేది. మెడలో టేప్ వేసుకుని కత్తెరతో సర్రున మెత్తగా కట్ చేసి, చెవిలో ఉన్న పెన్సిల్ తీసి మార్క్ చేసి వాటిని చుట్ట చుట్టి మెషీన్ మీదున్న టైలర్ వైపు విసిరేస్తున్నాడు మాస్టర్. యాక్షన్ సీన్ చూస్తున్నట్లే ఉంది గులాంకి. ‘‘నాన్నా! పదిహేను రూపాయలు. నెల జీతం. రోజుకు యాభై పైసలు. నే పనికి ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టలే. అందుకే మొత్తం జీతం వచ్చింది. అమ్మకిస్తున్నా’’ అంటూ తల్లి చేతిలో పెట్టాడు. గులాం తెచ్చిన డబ్బుకంటే... అతడి కళ్లలోని ఆనందాన్ని చూసి మురిసి పోయారు అతడి తల్లిదండ్రులు.‘‘నాన్నా! నేను సొంతంగా దర్జీ దుకాన్ పెడతా’’ అన్నాడోరోజు.‘‘ఎక్కడ పెడతావు, ఆబిడ్స్లోనేనా’’‘‘దర్జీలంతా ఆబిడ్స్లోనే ఉన్నట్లున్నారు. నేను ఎర్రగడ్డలో పెడతా, అఫ్జల్ కాకా స్టీల్ దుకాణం పక్కనే అద్దెకు గది ఉంది’’‘‘అన్నీ చూసుకున్నావ్. నేను చెప్పేదేంటి కానివ్వు’’ అలా... 1969లో మొదలైంది గులాం అలీ ఖాన్ సొంత దర్జీ దుకాణం. నెలకు పాతికరూపాయల అద్దె. ఒక బ్లవుజ్ కుడితే నాలుగు నుంచి ఐదు రూపాయలు నడుస్తున్న రోజులవి. ఐదు లేదా ఆరు బ్లవుజ్‌లు కుడితే రెంట్ వచ్చేస్తుంది. మిగిలిన డబ్బుతో జామ్‌జామ్‌గా బతికేయవచ్చు. ఇక ప్యాంట్ షర్టులకు లెక్కేలేదు. గవర్నమెంట్ ఉద్యోగుల కంటే పెద్ద రాబడి. ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. సొంతంగా ఎవరికీ తల వంచని దర్జీలా దర్జాగా జీవించవచ్చు. గులాం ముందున్న చిత్రం ఇది. కుర్రాడు మంచి పని వాడేననే పేరుతో పాటు పిల్లనిచ్చే వాళ్ల క్యూ రెడీ అయింది. షహనాజ్బేగంను పెళ్లి చేసుకున్నాడు. ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. తొమ్మిది మందినీ చదివించాడు. ఏడుగురికి పెళ్లిళ్లు చేశాడు గులాం అలీ ఖాన్. ఇక ఇద్దరికి పెళ్లి చేయాలి. ఇప్పుడతడి వయసు 71. 23 ఏళ్ల వయసులో సొంత దుకాణం తెరిచారు. అప్పటి నుంచి ఇప్పటికీ మడత నలగకుండా చక్కగా ఐరన్ చేసిన ఖరీదైన షర్టు, ప్యాంట్‌తో గెజిటెడ్ ఆఫీసర్లాగా ఉంటాడు. డ్రస్ అలాగే మెయింటెయిన్ చేస్తాడని చెప్తారు బాగా తెలిసిన వాళ్లు. పిల్లలు టేప్ పట్టుకోలేదు! గులాం ఆరుగురు కొడుకులనూ చదివించాడు. ఒక కొడుకు ఓలా క్యాబ్ నడుపుతున్నాడు. మున్సిపాలిటీ ఆఫీస్‌లో ప్రైవేట్ వర్క్, డీఎల్ఎఫ్లో ఉద్యోగం, టైలరింగ్ మెటీరియల్ షాప్, మొబైల్ షాప్, చిన్న కొడుకు డీజె. కొడుకులలో ఒక్కరినైనా దర్జీని చేయాలనుకున్నాడు గులాం. ‘‘ఈ దుకాణం మీదనే అందరినీ చదివించాను, పెళ్లిళ్లు చేశాను. అప్పట్లో చేతి నిండా పని. ఇప్పుడు నెలలో పదిహేను రోజులు పని ఉంటే చాలా బాగున్నట్లు. మిగిలిన రోజులు షాపు తెరిచి కూర్చోవాల్సిందే. అద్దెలు కట్టుకుంటూ, కరెంట్ బిల్లు కట్టుకుంటూ గిరాకీల కోసం ఎదురు చూస్తున్నాను. ‘మేమంతా పని చేస్తున్నాం, ఇంక దుకాణం బంద్ చేయ’మంటారు పిల్లలు. దుకాణం బంద్ చేయాలంటే అమ్మను చూడకుండా ఆమె ముఖాన తలుపేసినట్లే, అట్లా మనసు రాదు. పాణం సుస్తీ చేసినా సరే, సాయంత్రం ఓ గంటయినా వచ్చి కూర్చుంటాను. అప్పుడు పాతిక... ఇప్పుడు తొమ్మిది వేలు! అప్పట్లో ఐదారు బ్లవుజ్‌ల డబ్బు అద్దెకెళ్లేది. ఇప్పుడు బ్లవుజ్కు 175 రూపాయలు తీసుకుంటున్నాను. షాపు అద్దె తొమ్మిది వేలు, కరెంటు బిల్లు ఆరొందలు. ఎన్ని బ్లవుజ్‌లు కుడితే షాపు రెంటు గడవాలి. నేను లేడీస్, జెంట్స్ ఇద్దరికీ కుడతాను కాబట్టి ఈ మాత్రమైనా బండిని నడిపిస్తున్నాను. మగవాళ్ల దుస్తులు మాత్రమే కుట్టే వాళ్లు దుకాణాలు బంద్ చేసేశారు. మగవాళ్లంతా రెడీమేడ్ ప్యాంట్, షర్ట్ కొనుక్కుంటారు. వాళ్లకు దర్జీతో పనే ఉండటం లేదు. లేడీస్‌కి అలా కాదు. కరెక్ట్ ఫిట్టింగ్ రెడీమేడ్లో దొరకక టైలర్‌తో కుట్టించుకునే వాళ్లుంటారు. రెడీమేడ్ కొని ఆల్టరేషన్కి వచ్చేవాళ్లుంటారు. ఇప్పుడు టైలర్లను బతికిస్తున్నది ఆడవాళ్లే. రెడీమేడ్ దుస్తులు కుట్టడం ఈజీ! మూడు వందలకు రెడీమేడ్ కుర్తా వస్తుంది. మేము కుట్టడానికే 225 తీసుకుంటాం. మరి మా దగ్గరకు ఎందుకు వస్తారు? అలా చార్జ్ చేయకపోతే మేము బతకలేం. రెడీమేడ్లో లాగ మేము కుర్తాను బారుగా కుట్టేస్తే సరిపోదు. కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కుట్టాలి. దానికి టైమ్ పడుతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్లు కూడా పెద్ద పెద్ద దుస్తుల తయారీ కంపెనీలలో ఉద్యోగానికి వెళ్లిపోతున్నారు. అక్కడ ఐదు వేలిస్తారు. సైజ్‌ల వారీగా కామన్‌గా కుట్టేస్తారు. దాంతో దర్జీ దుకాన్ తెరమరుగు అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది’’ అన్నారు గులాం అలీ ఖాన్ ఆవేదనగా.దర్జీలు తెరమరుగవడానికి రెడీమేడ్ దుస్తులు మార్కెట్‌ని వెల్లువలా ముంచేయడం ఒక కారణమైతే, ఫ్యాషన్ డిజైనింగ్ మరో కారణం. పెద్దగా నైపుణ్యం లేని వాళ్లు తక్కువ జీతాలతో రెడీమేడ్ దుకాణాల కార్ఖానాల్లో చేరిపోతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ రంగం వేళ్లూనుకోవడంతో స్కిల్ ఉన్న టైలర్లు డిజైనర్‌తో కలిసి పని చేస్తున్నారు. సొంతంగా పనిచేసుకుంటూ నేను దర్జీని అని చెప్పుకునే వాళ్లు కనిపించడం లేదు. నా దగ్గరకు క్లాత్ తెచ్చి కుట్టించుకునే వాళ్లకు నేనెలా కుడతానో చెప్పేది నా డ్రస్సే. నేను రెడీమేడ్ డ్రస్ వేసుకుని టేప్ మెడలో వేసుకుని కొలతలు తీసుకుంటుంటే, కొలతలిచ్చే వాళ్లకు నా పని మీద నమ్మకం కలగదు. ఇతర కంపెనీలను ప్రమోట్ చేయడం కాదు, నాకు నేనే ప్రమోషన్ ఇచ్చుకోవాలి. నేను శుభ్రంగా, నీట్‌గా కనిపిస్తే నా దగ్గర కుట్టించుకోవడానికి వస్తారు. ఇది వృత్తి సూత్రం – వాకా మంజులారెడ్డి -
రద్దైన గులాం అలీ కచేరి
ఢిల్లీ: గులాం అలీ..గజల్ గురించి, హిందుస్తానీ సంగీతం గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గజల్స్ వినేందుకు ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే సోమవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరగాల్సిన ఆయన కార్యక్రమం రద్దయింది. హిందూ సేన నుంచి కార్యక్రమాన్ని నిర్వహించకూడదని హెచ్చరికలు రావడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఢిల్లీలోని రాయల్ ప్లాజా హోటల్లో సోమవారం సాయంత్రం 'గర్ వాపసీ' చిత్ర సంగీతాన్ని విడుదల చేసి అనంతరం కచేరి నిర్వహించాల్సి ఉంది. ఆర్ఎస్ఎస్, భజ్రంగ్ దళ్, హిందూసేనలనుంచి బెదిరింపులు రావడంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా తనకు ఫోన్ చేసి బెదిరించారని గర్ వాపసీ చిత్ర నిర్మాత సుహైబ్ ఇల్యాసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాధ తొలగిపోయింది: గులాంఅలీ
♦ కోల్‌కతాలో పాక్ గాయకుడి కచేరీ ♦ సంగీతానికి ఎల్లల్లేవు: మమత కోల్‌కతా: పాకిస్తానీ గజల్ గాయకుడు గులాం అలీ మంగళవారం కోల్‌కతాలో కచేరీ నిర్వహించారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కచేరీకి వేలాది మంది హాజరయ్యారు. ‘నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడూ కోల్‌కతాకు వస్తుండేవాడిని. కానీ.. ఈ ఏడాది మాత్రం 50 ఏళ్ల తర్వాత వచ్చినట్లు అనిపిస్తోంది. నాకు చాలా బాధగా ఉండేది.. కానీ ఇప్పుడా బాధ తొలగిపోయింది’ అని ఆయన అన్నారు. తాను ప్రపంచమంతటా కచేరీలు నిర్వహిస్తుంటాని, ఎక్కడ ఎక్కువ సంతోషంగా ఉంటుందని అడిగితే ఎప్పుడూ కోల్‌కతానే అని చెప్తానన్నారు. ప్రజాభిమానం గల తన ‘చుప్కే చుప్కే రాత్ దిన్, హంగామా హై క్యో బార్పా...’ పాటలను ఆయన పాడినపుడు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. గులాంఅలీని సంగీత సామ్రాట్ అని కీర్తిస్తూ.. సంగీతానికి సరిహద్దులు ఉండవని ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆడిటోరియం సామర్థ్యం 12,000 మందే కావటంతో కచేరీకి అందరికీ చోటుదక్కలేదన్నారు. అలీ మన మధ్య.. అద్భుతం: మహేశ్‌భట్ ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న పటియాలా ఘరానా గాయకుడు గులాం అలీ వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో ముంబైలో ఆయన కచేరీని ఏర్పాటు చేసినప్పటికీ.. దానిని అడ్డుకుంటామని శివసేన హెచ్చరించటంతో ఆ కార్యక్రమం రద్దయింది. పాక్ నుంచి భారత్‌పై జరుగుతున్న ఉగ్రవాదం నిలిచిపోయే వరకూ.. ఆ దేశానికి చెందిన ఏ కళాకారుడినీ ముంబైలో ప్రదర్శన ఇవ్వబోమని అప్పుడు శివసేన హెచ్చరించింది. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతాలో అలీ కచేరీని నిర్వహించింది. స్వామి వివేకానంద 153వ జయంతి రోజున యాదృచ్ఛికంగా నిర్వహించిన ఈ కచేరీని.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాణిజ్య ప్రదర్శన ‘మిలన్ ఉత్సవ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు. అలీ తమ మధ్య ఉండటం ఒక అద్భుతం వంటిదని ప్రేక్షకుల్లో ఉన్న బాలీవుడ్ సినీనిర్మాత మహేశ్‌భట్ అభివర్ణిస్తూ.. అందుకు మమతకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కొన్ని నెలల కిందట ముంబైలో సృష్టించిన వాతావరణం చూసి మేం ఆశలు వదులుకున్నాం’ అని భట్ వ్యాఖ్యానించారు. త్రిపుర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు అగర్తల: గులాంఅలీ కోల్‌కతా కచేరీపై త్రిపుర గవర్నర్ తథాగతరాయ్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కోల్‌కతాలో పాకీ గాయకుడు గులాం అలీ. పాకీల చేతుల్లో బెంగాలీలు బాధపడ్డంతగా మరెవరూ బాధపడలేదు. బెంగాలీలు మరచిపోయారు’ అని ట్విటర్లో వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవి చేపట్టకముందు బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన రాయ్.. ‘1950 ఫిబ్రవరి 12న అశోగంజ్ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) వద్ద మేఘ్నా బ్రిడ్జిని దాటుతున్న అన్ని రైళ్లనూ ఆపివేశారు.. హిందువులందరినీ పొడిచి నదిలో విసిరివేశారు’ అని మరో ట్వీట్ చేశారు. -
12న కోల్ కతాలో గులాం అలీ కచేరీ
కోల్ కతా: పాకిస్థాన్ కు చెందిన ప్రఖ్యాత గజల్ గాయకుడు గులాం అలీ, ఆయన తనయుడు జనవరి 12న కోల్ కతాలో కచేరీ చేయనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రీన్ ఈ మేరకు మంగళవారం ప్రకటన చేశారు. 'గులాం అలీ, ఆయన తనయుడు జనవరి 12న కోల్ కతాలోని సర్కస్ మైదాన్ లో కచేరీ చేయనున్నార'ని డెరెక్ ఒబ్రీన్ ట్వీట్ చేశారు. గతేడాది అక్టోబర్ లో ముంబైలో కచేరీ చేయనివ్వకుండా గులాం అలీని శివసేన అడ్డుకుంది. దీంతో కోల్ కతాలో కచేరీ చేయడానికి గులాం అలీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానించారు. -
'రద్దును రద్దు చేశారు'
కరాచీ: పాకిస్థాన్ ప్రముఖ గజల్ మ్యాస్ట్రో గులాం అలీ మాట మార్చారు. తను పెట్టుకున్న షరతును తానే రద్దు చేసుకున్నారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను భారత్‌లో ఎలాంటి సంగీత కచేరీలు నిర్వహించబోనని, ఇప్పటికే ఒప్పుకున్న కార్యక్రమాలు కూడా రద్దు చేసుకుంటున్నానని ప్రకటించిన ఆయన తిరిగి ఆ కార్యక్రమాలను కొనసాగించేందుకు వస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ 3న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ కచేరి కార్యక్రమానికి వస్తున్నట్లు కీలక వర్గాల సమాచారం. ఇటీవల ముంబై, ఢిల్లీలో నిర్వహించాల్సిన సంగీత కచేరి కార్యక్రమాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, అయితే, భారత రాజకీయాలు తనను అమితంగా గాయపరిచాయని, తనను వివాదంలోకి లాగి కొన్ని రాజకీయ పార్టీలు లబ్దిపొందాలని చూస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇరు దేశాలమధ్య సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను కచేరిలు భారత్‌లో నిర్వహించబోనని చెప్పిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆయన తన మనసు మార్చుకోవడం గమనార్హం. -
'హర్ట్ అయ్యాను.. ఇక భారత్‌లో నో..'
కరాచీ: పాకిస్థాన్ ప్రముఖ గజల్ మేస్ట్రో గులాం అలీ భవిష్యత్తులో భారత్‌లో ఎలాంటి సంగీత కచేరి కార్యక్రమాలను నిర్వహించబోనని స్పష్టం చేశారు. భారత రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను ఇక కచేరి కార్యక్రమాలను భారత్‌లో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించనని చెప్పారు. ఇప్పటికే ఆయన లక్నో, ఢిల్లీలో నవంబర్ 25న ఒకటి, డిసెంబర్ 3న మరొకటి సంగీత కచేరి నిర్వహించాల్సి ఉంది. అయితే, వాటిని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు తెలిపారు. తాను నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా భారత్‌లో కొన్ని పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నించే తీరు తనను ఇబ్బంది పెట్టిందని అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పారు. ఇదిలా ఉండగా, గులాం నిర్ణయాన్ని భారత్ సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్ స్వాగతించారు. గులాం అలీ సరైన నిర్ణయం తీసుకున్నారని, అలాగే, పాకిస్థాన్ కూడా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చేవరకు, సరిహద్దులో ఉన్న భారత సైనికులతో సరిగా వ్యవహరించేవరకు గులాం ఇండియాలో అడుగుపెట్టవద్దని సలహా కూడా ఇచ్చారు. భారత సైనికులను పాకిస్థాన్ చంపేస్తుందని ఆయన ఇప్పటికి అర్ధం చేసుకున్నందుకు పొగడకుండా ఉండలేకపోతున్నానని చెప్పారు. -
థాంక్యూ సర్..నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గజల్ మాస్ట్రో గులాం అలీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి డిసెంబర్ లో ఢిల్లీలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంగీకరించినందుకు ఆయన థాంక్స్ చెప్పారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో శుక్రవారం షేర్ చేశారు. గులాం అలీ సాబ్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మీతో మాట్లాడ్డం చాలా సంతోషంగా ఉంది అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్ చేశారు. కాగా ప్రఖ్యాత గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ముంబై, పుణే నగరాలలో జరిగే సంగీత కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే శివసేన బెదిరింపుల నేపథ్యంలో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ నగరంలో కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ ఢిల్లీనేత గులాం అలీ ఆహ్వానించారు. దీంతో భారత్‌లోని అభిమానుల అలరించేందుకు డిసెంబర్లో కన్సర్ట్ నిర్వహించనున్నట్టు అలీ ప్రకటించారు. Ghulam Ali Sahib. Hum apke bahut bade fan hain. Abhi apse baat karke bahut acha laga. Thanks for agreeing to do a program in Delhi in Dec. — Arvind Kejriwal (@ArvindKejriwal) October 9, 2015 -
రాజకీయాలకు 'గులామ్' ..
- పాకిస్థానీ గాయకుడు గులామ్ అలీ.. భారత్ లో పాడటానికి వీలులేదంటూ శివసేన ఆందోళనలు - ముంబైలో ఎల్లుండి జరగాల్సిన గజల్ కచేరీ రద్దు ముంబై: సంగీత సాహిత్యాలకు కులం, మతం, ప్రాంతం, భాషా బేధాలు లేవంటారు. కానీ అది నిజం కాదని, పశ్చిమ సరిహద్దును దాటి వచ్చే సంగీతాన్ని భారతీయులు వినకూడదని అంటున్నారు శివసేన పార్టీ నేతలు, కార్యకర్తలు. కళలు, క్రీడలపై తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిచజూసే శివసేన పార్టీ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు, పాకిస్థానీ అయిన ఉస్తాద్ గులామ్ అలీ.. ముంబైలో శుక్రవారం నిర్వహించనున్న సంగీతకచేరీని రద్దుచేయాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. 'ఓవైపు సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం భారతీయులను కాల్చిచంపుతుంటే.. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమిటి?' అంటూ నినాదాలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ' పాకిస్థాన్ తో క్రీడలైనా, సాంస్కృతి అంశమైనా, దౌత్యపరమైన చర్చలైనా ప్రతిదానినీ మేం వ్యతిరేకిస్తం. ఆ దేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంతవరకు మా వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదు' అన్నారు. ఈ మేరకు కచేరీ జరగనున్న షణ్ముఖానంద్ హాల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం సాయంత్రం గులామ్ అలీ కచేరి ప్రారంభం కావాల్సిఉంది. కాగా శివసేన ప్రకటనలతో అప్రమత్తమైన ఫడ్నవిస్ సర్కార్.. గులామ్ అలీ కచేరీ కి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తానని ప్రకటించింది. కానీ.. చివరి నిమిషంలో కచేరీ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సంగీత కార్యక్రమం సజావుగా సాగదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. -
అటు చావులూ.. ఇటు సంగీతమా?
ముంబై: కళలు, క్రీడలపై తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిచజూసే శివసేన పార్టీ మరో వివాదానికి తెరలేపింది. ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు, పాకిస్థానీ అయిన ఉస్తాద్ గులామ్ అలీ.. ముంబైలో నిర్వహించనున్న సంగీతకచేరీని అడ్డుకుంటామంటూ శివసేన కార్యకర్తలు బుధవారం ఆందోళనలు నిర్వహించారు. 'ఓవైపు సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం భారతీయులను కాల్చిచంపుతుంటే.. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమిటి?' అంటూ నినాదాలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ' పాకిస్థాన్ తో క్రీడలైనా, సాంస్కృతి అంశమైనా, దౌత్యపరమైన చర్చలైనా ప్రతిదానినీ మేం వ్యతిరేకిస్తం. ఆ దేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంతవరకు మా వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదు' అన్నారు. ఈ మేరకు కచేరీ జరగనున్న షణ్ముఖానంద్ హాల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం సాయంత్రం గులామ్ అలీ కచేరి ప్రారంభం కావాల్సిఉంది. అయితే శివసేన బెదిరింపులపై ఫడ్నవిస్ సర్కార్ ఇప్పటివరకు పెదవివిప్పలేదు. దీంతో గులామ్ అలీ కచేరీ నిరాటంకంగా జరుగుతుందా? లేదా అనే విషయంపై ఆయన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.