బాధ తొలగిపోయింది: గులాంఅలీ
♦ కోల్‌కతాలో పాక్ గాయకుడి కచేరీ
♦ సంగీతానికి ఎల్లల్లేవు: మమత
కోల్‌కతా: పాకిస్తానీ గజల్ గాయకుడు గులాం అలీ మంగళవారం కోల్‌కతాలో కచేరీ నిర్వహించారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కచేరీకి వేలాది మంది హాజరయ్యారు. ‘నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడూ కోల్‌కతాకు వస్తుండేవాడిని. కానీ.. ఈ ఏడాది మాత్రం 50 ఏళ్ల తర్వాత వచ్చినట్లు అనిపిస్తోంది. నాకు చాలా బాధగా ఉండేది.. కానీ ఇప్పుడా బాధ తొలగిపోయింది’ అని ఆయన అన్నారు. తాను ప్రపంచమంతటా కచేరీలు నిర్వహిస్తుంటాని, ఎక్కడ ఎక్కువ సంతోషంగా ఉంటుందని అడిగితే ఎప్పుడూ కోల్‌కతానే అని చెప్తానన్నారు. ప్రజాభిమానం గల తన ‘చుప్కే చుప్కే రాత్ దిన్, హంగామా హై క్యో బార్పా...’ పాటలను ఆయన పాడినపుడు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. గులాంఅలీని సంగీత సామ్రాట్ అని కీర్తిస్తూ.. సంగీతానికి సరిహద్దులు ఉండవని ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆడిటోరియం సామర్థ్యం 12,000 మందే కావటంతో కచేరీకి అందరికీ చోటుదక్కలేదన్నారు.
అలీ మన మధ్య.. అద్భుతం: మహేశ్‌భట్
ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న పటియాలా ఘరానా గాయకుడు గులాం అలీ వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో ముంబైలో ఆయన కచేరీని ఏర్పాటు చేసినప్పటికీ.. దానిని అడ్డుకుంటామని శివసేన హెచ్చరించటంతో ఆ కార్యక్రమం రద్దయింది. పాక్ నుంచి భారత్‌పై జరుగుతున్న ఉగ్రవాదం నిలిచిపోయే వరకూ.. ఆ దేశానికి చెందిన ఏ కళాకారుడినీ ముంబైలో ప్రదర్శన ఇవ్వబోమని అప్పుడు శివసేన హెచ్చరించింది. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతాలో అలీ కచేరీని నిర్వహించింది. స్వామి వివేకానంద 153వ జయంతి రోజున యాదృచ్ఛికంగా నిర్వహించిన ఈ కచేరీని.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాణిజ్య ప్రదర్శన ‘మిలన్ ఉత్సవ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు. అలీ తమ మధ్య ఉండటం ఒక అద్భుతం వంటిదని ప్రేక్షకుల్లో ఉన్న బాలీవుడ్ సినీనిర్మాత మహేశ్‌భట్ అభివర్ణిస్తూ.. అందుకు మమతకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కొన్ని నెలల కిందట ముంబైలో సృష్టించిన వాతావరణం చూసి మేం ఆశలు వదులుకున్నాం’ అని భట్ వ్యాఖ్యానించారు.
త్రిపుర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
అగర్తల: గులాంఅలీ కోల్‌కతా కచేరీపై త్రిపుర గవర్నర్ తథాగతరాయ్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కోల్‌కతాలో పాకీ గాయకుడు గులాం అలీ. పాకీల చేతుల్లో బెంగాలీలు బాధపడ్డంతగా మరెవరూ బాధపడలేదు. బెంగాలీలు మరచిపోయారు’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవి చేపట్టకముందు బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన రాయ్.. ‘1950 ఫిబ్రవరి 12న అశోగంజ్ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) వద్ద మేఘ్నా బ్రిడ్జిని దాటుతున్న అన్ని రైళ్లనూ ఆపివేశారు.. హిందువులందరినీ పొడిచి నదిలో విసిరివేశారు’ అని మరో ట్వీట్ చేశారు.