
అభిమాని అంతిమ కోరిక తీర్చిన శ్రుతి
అభిమానం ఎంత బలమైందంటే కొందరు తమ అభిమాన తారలను పిచ్చగా ప్రేమించేస్తారు. పూణేకు చెందిన అమ్మాయి సీతల్‌పవర్(17) కేన్సర్‌తో బాధపడుతోంది. ఆమెను వ్యాధి నుంచి బయట పడేయడానికి చివరి వరకు పోరాడిన వైద్యులు ఫలితం లేక చేతులెత్తేశారు. ఇంటికి తీసుకెళ్లి ఆమె చివరి కోరికలు తీర్చే ప్రయత్నం చేయమని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు సీతల్ పవర్ కోరిక తెలుసుకుని షాక్ అయ్యారు. తన అభిమాన తార శ్రుతిహాసన్‌ను ఒకసారి దగ్గరగా చూడాలన్నదే సీతల్ పవర్ చివరి కోరికట.
దీంతో ముంబయిలో యారా చిత్ర షూటింగ్‌లో ఉన్న శ్రుతిహాసన్‌కు మేక్ ఎ విష్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సీతల్ పవర్ చివరి కోరిక గురించి వివరించారు. దీంతో మనసు కరిగిపోయిన శ్రుతిహాసన్ చిత్ర యూనిట్ అనుమతి తీసుకుని వెంటనే పూణేలోని సీతల్ పవర్‌ను ప్రత్యక్షంగా కలిసి ఆమెను ఓదార్చారు. సినిమాలు, ఇతర విషయాల గురించి ఇద్దరు చాలా సేపు ముచ్చటించుకున్నారు. మృత్యువుతో పోరాడుతున్న సీతల్ పవర్ ధైర్యాన్ని శ్రుతి మెచ్చుకుంటూ ఆమె రాసిన ఒక లేఖను ఆమెకు ఇచ్చారు.