పోరాడి పోరాడి మరణించాడు | Tribute To Irrfan Khan One Of Indias Best Actors | Sakshi
Sakshi News home page

దేశ ప్రతిష్టను పెంచిన నటుడు

Published Thu, Apr 30 2020 12:56 AM | Last Updated on Thu, Apr 30 2020 7:41 AM

Tribute To Irrfan Khan One Of Indias Best Actors - Sakshi

అతని కోసం హాలీవుడ్‌ దర్శకులు పాత్రలు రాశారు. అతన్ని ప్రశంసించడానికి ఆస్కార్‌ స్థాయి నటీనటులు క్యూలలో వేచి చూశారు. భారతదేశంలో పెద్ద హీరోల సినిమాలకు ఎంత కలెక్షన్‌ వస్తుందో అతనికీ అంతే వస్తుంది. కొన్ని సినిమాలు అతను నటించడం వల్ల ఇలా కూడా బాగున్నాయే అనిపించింది. ఇర్ఫాన్‌ ఖాన్‌ జీవితానికి దగ్గరగా ఉన్న నటుడు. జీవితం అంత అందమైన నటుడు. జీవితంలో మృత్యువు ఒక భాగం అయినప్పుడు ఆ మృత్యువుకు తల వొంచుతాను అని అనుకున్నాడు. అతను పలికిన వీడ్కోలు కొన్ని జ్ఞాపకాలపాటు మనల్ని తప్పక వెంటాడుతుంది.

జైపూర్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు ‘టోంక్‌’లో బతికి చెడ్డ నవాబుల కుటుంబంలో పుట్టి పెరిగిన ఇర్ఫాన్‌ఖాన్‌ అక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’లో నటన నేర్చుకోవాలనుకున్నప్పుడు అతని తల్లి అడిగింది– ‘ఏమిటి... ఇక నువ్వు గట్లమ్మట పుట్లమ్మట ఆడుతూ పాడుతూ కనిపించే పనే చేస్తావా?’ అని. ఎందుకంటే అప్పటివరకూ వాళ్ల కుటుంబాలలో నటన పేరు ఎత్తినవారు లేరు. సినిమాలు పెద్దగా చూసినవారూ లేరు. ఒకవేళ చూసినా హీరో అంటే పార్కుల్లో పాటలు పాడుతూ డాన్స్‌ చేస్తూ కనిపించేవాడనేదే అభిప్రాయం. తల్లికి ఇర్ఫాన్‌ మాటిచ్చాడు– ‘అమ్మా... నేను ఆడటం పాడటంతో పాటు ఇంకా మంచి పని కూడా చేస్తాను. నువ్వు నన్ను చూసి సిగ్గుపడేలా చేయను’.

ఇర్ఫాన్‌ ఖాన్‌ తన మాట నిలబెట్టుకున్నాడు. తన పూర్తి కెరీర్‌లో ఎప్పుడూ స్టెప్పులేస్తూ పాటలు పాడుతూ కనిపించలేదు. నటన చేస్తూ కనిపించాడు. నటన కూడా మాటతో కాకుండా ముఖంతో ఎక్కువ చేస్తూ కనిపించాడు. ముఖం కన్నా కళ్లతో ఇంకా ఎక్కువ చేస్తూ కనిపించాడు. ప్రేక్షకుడి చెవి కంటే కంటికి ఎక్కువ దృష్టి కల్పించబట్టే ఇర్ఫాన్‌ ఖాన్‌ ఈ దేశంలో ఎంతో ముఖ్యమైన నటుడు అయ్యాడు. బయటి దేశాలలో కూడా ముఖ్యమైన నటుడు అనిపించుకున్నాడు. వెస్‌ ఆండర్‌సన్‌ వంటి ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు, మైఖేల్‌ వింటర్‌బాటమ్‌ వంటి ప్రసిద్ధ బ్రిటిష్‌ దర్శకుడు కేవలం ఇర్ఫాన్‌ నటించడం కోసం తమ సినిమాల్లో ఏదో ఒక పాత్ర అయినా రాశారు.

‘లైఫ్‌ ఆఫ్‌ పై’లో నటించి మహామహులు ఒకసారి కలిస్తే చాలనుకునే చైనిస్‌ దర్శకుడు ఆంగ్‌ లీని మెప్పించాడు ఇర్ఫాన్‌. ‘జురాసిక్‌ వరల్డ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌లో చోటు సంపాదించి ప్రపంచమంతా సాధించిన కలెక్షన్లకు తన వంతు ప్రతిభ జోడించాడు. టామ్‌ హ్యాంక్స్‌ గొప్ప నటుడు. అతడికి సరిజోడుగా నటించి ‘ఇన్‌ఫెర్నో’ లో కాలర్‌ ఎగురవేయగలిగాడు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ అతడి కెరీర్‌ని మరింత విస్తృతపరిచింది. భారతదేశంలో చాలామంది గొప్ప నటులు ఉన్నారు. కాని ప్రపంచ దృష్టికి వెళ్లినవారు బహు కొద్ది. ఇర్ఫాన్‌ ఖాన్‌ ఆ వెలితి చెరిపేసి భారతీయులూ గొప్పగా నటించగలరు అని బాహ్య ప్రపంచానికి నిరూపించగలిగాడు. భారతదేశం అంటే గంగ, యమున, తాజ్‌మహల్‌... ఇర్ఫాన్‌ కూడా.  చదవండి: ఇర్ఫాన్‌ మృతిపై స్పందించిన యువీ

కష్టాల ప్రయాణం
అయితే ఈ ప్రయాణం అంత సులువు కాదు. ఘన విజయాల వెనుక చేదు చీకట్లు, మసక వెలుతురులు మాత్రమే ఉంటాయి. ఇంటర్‌ చదివే సమయంలో హిందీ సినిమాలలో మిథున్‌ చక్రవర్తి అంటే క్రేజ్‌ ఉండేది. ఇర్ఫాన్‌ ఖాన్‌ మిథున్‌ చక్రవర్తి పోలికలతో ఉండటంతో స్నేహితులందరూ అతణ్ణి సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారు. అప్పటికి అతను క్రికెట్‌లో మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు. రంజి స్థాయికి చేరుకున్నాడు కూడా. కాని నటన కోసం నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో చేరాడు. అయితే యాక్టింగ్‌ కోర్సు పూర్తయ్యాక ముంబై చేరుకున్న ఇర్ఫాన్‌ ఖాన్‌కు అవకాశాలు ఏమీ రాలేదు. ‘సలామ్‌ బాంబే’ (1998)లో ఒక చిన్న పాత్ర దొరికింది కాని ఎడిటింగ్‌లో దర్శకురాలు మీరా నాయర్‌ దానిని కత్తిరించేసింది. ఆల్బమ్స్‌ పట్టుకుని నిర్మాతలు దగ్గరకు వెళితే ఇర్ఫాన్‌ ధోరణి, నటనా పద్ధతి ఆ కాలానికి అర్థం కాక తిరస్కారాలు ఎదురయ్యేవి.

దాంతో చాలాకాలం టీవీ సీరియల్స్‌ చేస్తూ పొట్టపోసుకున్నాడు ఇర్ఫాన్‌. ఒక దశలో తీవ్రమైన డిప్రెషన్‌కు వెళ్లి మానసిక చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే ‘చంద్రకాంత’, ‘బనేగి అప్‌నీ బాత్‌’ వంటి సీరియల్స్‌ అతనికి పేరు తెచ్చాయి. స్టార్‌ ప్లస్‌లో హోస్ట్‌గా చేసిన షోస్‌ హిట్‌ అయ్యాయి. 2001లో ఆసిఫ్‌ కపాడియా అని బ్రిటిష్‌ దర్శకుడు ఒక రాజస్థాన్‌ కత్తియోధుడి జీవితాన్ని ‘ది వారియర్‌’గా తీయడంతో మొదటిసారి అంతర్జాతీయ ప్రేక్షకులకు ఇర్ఫాన్‌ పరిచయమయ్యాడు. ‘మేక్‌బెత్‌’ ఆధారంగా విశాల్‌ భరద్వాజ్‌ తీసిన ‘మక్బూల్‌’ (2003)లో లీడ్‌రోల్‌ చేసి నేనొచ్చాను అని భారతీయ ప్రేక్షకులకు హెచ్చరిక చేశాడు. ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’ (2007)తో అతనికి ‘స్టార్‌డమ్‌’ వచ్చింది.

భార్య సుతప, కుమారులు బాబిల్, అయాన్‌లతో ఇర్ఫాన్‌ 
అద్భుతమైన ప్రతిభ
ఇర్ఫాన్‌ ఖాన్‌ కేవలం మేకప్‌ వేసుకున్నాకే పాత్ర కోసం ఆలోచించే నటుడు ఎంత మాత్రం కాదు. విపరీతంగా హోమ్‌వర్క్‌ చేస్తాడు. సిద్ధమవుతాడు. గతంలో ఎవరైతే చిన్న పాత్ర ఇచ్చి కత్తిరించేసిందో ఆ మీరా నాయరే జుంపా లాహిరి నవల ఆధారంగా ‘నేమ్‌సేక్‌’ (2007) సినిమా తీయాలనుకున్నప్పుడు లీడ్‌ రోల్‌ ఇర్ఫాన్‌కే ఇచ్చింది. అమెరికాకు వెళ్లిన తొలితరం బెంగాలీ జంట తన పిల్లలు భారతీయ–అమెరికా మిశ్రమ సంస్కృతితో ఎలా సంఘర్షణ పడ్డారనేది ఈ కథ. ఇందులో బెంగాలీ పాత్రను పోషించడానికి ఇర్ఫాన్‌ దాదాపుగా బెంగాలీ నేర్చుకున్నాడు. ఎంతగా నేర్చుకున్నాడంటే అతడు పలికిస్తున్న యాస మరీ లోతుగా ఉందని తేలిక పర్చడానికి దర్శకురాలు అవస్థ పడాల్సి వచ్చింది.

‘నేమ్‌సేక్‌’ ఇర్ఫాన్‌కు అమెరికాలో మంచి పేరు తెచ్చింది. ఆ పేరు వల్ల అతనికి ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’, ‘అమేజింగ్‌ స్పైడర్‌మేన్‌’, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ సినిమాలు వరుస కట్టాయి. ఇక బాలీవుడ్‌లో అతడు సోలో హీరోగా సినిమాలు చేయడానికి ‘బిల్లు’ (2009) దారి వేసినా ‘పాన్‌సింగ్‌ తోమార్‌’ (2012) జాతీయ ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఆకాశానికెత్తింది. ‘లంచ్‌ బాక్స్‌’, ‘పికూ’, ‘మదారి’, ‘కరీబ్‌ కరీబ్‌ సింగిల్‌’... ఈ సినిమాలన్నీ థియేటర్ల వద్ద కాకపోయినా అభిమానుల గుండెల్లో కటౌట్‌ సైజ్‌ను పెంచుకుంటూ పోయాయి. 14 కోట్లతో తీసిన ‘హిందీ మీడియమ్‌’ సినిమా 300 కోట్ల కలెక్షన్లు సాధించి ఈ ఖాన్‌ కూడా ఏ ఖాన్‌లకు తక్కువ కాదని నిరూపించింది.

పెద్దవారూ సమ ఉజ్జీలే
ఇర్ఫాన్‌ ఖాన్‌ నటించిన ‘నేమ్‌సేక్‌’ చూసి షర్మిలా టాగోర్‌ ‘నిన్ను కన్నందుకు మీ అమ్మానాన్నలకు థ్యాంక్స్‌ చెప్పాలి’ అంది. షబానా ఆజ్మీ ఇర్ఫాన్‌ నటనకు ఫిదా అయిపోయింది. ఏంజలీనా జోలీ, జూలియా రాబర్ట్స్‌ అతని నటనకు బాహాటంగా తమ అభిమానం వ్యక్తపరిచారు. ఇర్ఫాన్‌ తన కెరీర్‌లో గొప్ప గొప్ప నటులతో కలిసి నటించాడు. అమితాబ్‌ బచ్చన్, పంకజ్‌ కపూర్, నసీరుద్దిన్‌ షా, ఓంపురి, షారూక్‌ ఖాన్, టబు, అనుపమ్‌ఖేర్‌ తదితరులు ఉన్నారు. అమితాబ్‌తో కలిసి ‘పికూ’లో అతడు చేసిన నటన అమితాబ్‌ను ముగ్ధుణ్ణి చేసేలా చేసింది. ఇర్ఫాన్‌తో పోటీ పడేలా చేసింది. 

ఇర్ఫాన్‌ వ్యక్తిగా, నటుడిగా అందరికీ ఆత్మీయుడైపోయాడు. కెరీర్‌లో ఇంకెన్నో ఎత్తులు చూస్తాడని అందరూ ఆశిస్తున్న సమయం. కాని హఠాత్తుగా పేకప్‌ చెప్పేశాడు. ఇర్ఫాన్‌ మరణాన్ని విని నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ‘అవర్‌ లాస్, హెవెన్స్‌ గెయిన్‌’ అని ట్వీట్‌ చేశాడు. తమ వద్దకు ఇర్ఫాన్‌ చేరుకున్నందుకు స్వర్గం మిడిసిపడుతుండవచ్చు. కాని ఇంత అర్థం లేని స్క్రిప్ట్‌ రాసి అతణ్ణి తన వద్దకు తెచ్చుకున్నవారు అక్కడ గొప్ప స్క్రిప్టు ఇస్తారని ఏ కోశానా ఆశించలేము.
వందలాది నటీనటులు అతని స్ఫూర్తితో దీప్తినొంది భూలోకాన అతడి కీర్తికి చిరంజీవిత్వం తెస్తారనేది తథ్యం. చదవండి: ఇర్ఫాన్ కాల్ కోసం ఎదురు చూస్తా
– సాక్షి ఫ్యామిలీ

పోరాడి పోరాడి మరణించాడు
సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ (53) బుధవారం ఉదయం ముంబైలో మరణించాడు. గత రెండేళ్లుగా బ్రెయిన్‌ కేన్సర్‌తో పోరాడుతూ, లండన్‌లో వైద్యం తీసుకోవడం ద్వారా కోలుకొని భారత్‌కు వచ్చిన ఇర్ఫాన్‌ ఖాన్‌ పేగు సంబంధిత ఇన్ఫెక్షన్‌ వల్ల మంగళవారం కోకిలాబెన్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. ఐ.సి.యులో ఉంచి వైద్యం జరుగుతుండగా బుధవారం ఉదయం  మరణించాడని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆయనకు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బాబిల్, అయాన్‌ ఉన్నారు. సుతాప అతని సహ విద్యార్థిని. ఢిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో యాక్టింగ్‌ నేర్చుకుంటూ ఉండగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. 

ఇర్ఫాన్‌ ఖాన్‌ బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్, బ్రిటిష్‌ సినిమాలలో నటించాడు. బంగ్లాదేశ్, ఫ్రాన్స్‌ దేశాలు కూడా అతనితో చెరి ఒక సినిమా నిర్మించాయి. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘జురాసిక్‌ వరల్డ్‌’ సినిమాలు, ‘ఇన్‌ ట్రీట్‌మెంట్‌’ వంటి టివి సిరీస్‌ అతణ్ణి దేశదేశాల ప్రేక్షకులకు చేరువ చేశాయి. 2007లో అనురాగ్‌ బాసు తీసిన ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’తో ఇర్ఫాన్‌ స్టార్‌డమ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత పెద్ద హీరోలు హీరోయిన్‌లు అతడితో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు. అతడి చివరి సినిమా ‘అంగ్రేజీ మీడియమ్‌’ లాక్‌డౌన్‌కు ముందురోజు విడుదలయ్యి సినిమాహాళ్ల మూత కారణాన ఎక్కువమందికి చేరలేదు. ప్రస్తుతం ఆ సినిమా ‘డిస్నీహాట్‌స్టార్‌’లో స్ట్రీమ్‌ అవుతూ ఉంది.

2018 ఫిబ్రవరిలో ఇర్ఫాన్‌ఖాన్‌ అస్వస్థత వార్త ప్రపంచానికి తెలిసింది. మార్చిలో అతనికి ‘న్యూరో ఎండోక్రైన్‌ ట్యూమర్‌’ (బ్రెయిన్‌ కేన్సర్‌) అని చెప్పారు. వైద్యం కోసం లండన్‌ వెళ్లిన ఇర్ఫాన్‌ సినిమా ప్రపంచంతో దాదాపు దూరంగా ఉంటూ వైద్యానికి సహకరించాడు. షారూక్‌ ఖాన్‌ అతడి కోసం లండన్‌లోని తన ఇల్లు ఇచ్చి సాయపడ్డాడు. అతను కోలుకోవడం గురించి పెద్దగా వార్తలు బయటకు రాకపోయినా ఇటీవల ‘అంగ్రేజీ మీడియమ్‌’లో నటించడంతో అంతా బాగున్నట్టేనని అభిమానులు ఆనందించారు. ఇంతలోనే అతడి మరణవార్త శరాఘాతంలా తాకింది. చదవండి: ఇర్ఫాన్‌, సుతాప అపూర్వ ప్రేమకథ

దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ ఇర్ఫాన్‌ఖాన్‌కు దగ్గరి మిత్రుడు. ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణవార్తను అతడు లోకానికి తెలియచేస్తూ ‘ఇర్ఫాన్‌ నువ్వు పోరాడి పోరాడి పోరాడి మరణించావు. సుతాప (ఇర్ఫాన్‌ భార్య) నువ్వు చేయవలసిందంతా చేశావు’ అని ట్వీటర్‌లో రాశాడు. అనారోగ్యంతో పోరాడుతూ మృత్యువును ఆమడదూరంలో గమనిస్తున్న ఇర్ఫాన్‌ ‘జీవితపు అసలు రుచి ఇప్పుడు చూస్తున్నాను’ అన్నట్టుగా పేర్కొన్నారు. ‘లైఫ్‌ ఆఫ్‌ పై’లో ఇర్ఫాన్‌ ధరించిన పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక చిన్న పడవలో సముద్రం మధ్యన చిక్కుకుంటుంది. పైగా ఆ పడవలో పులి కూడా ఉంటుంది. అయినప్పటికీ ఆ పాత్ర బతికి బట్టకడుతుంది. కాని నిజ జీవితంలో కేన్సర్‌ అనే పెద్దపులి ఇర్ఫాన్‌ను కోరలు దింపి కబళించడం మాత్రం అభిమానులకు బాధాకరం. సినీ జగత్తుకు విషాదం. కాగా, ఇర్ఫాన్‌ ఖాన్‌ అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కేవలం 20 మంది కుటుంబ సభ్యులు, మిత్రులను మాత్రమే అనుమతించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement