ఏకమైతే సీఎం కుర్చీ మనదే
సాక్షి, బళ్లారి: ఆరు కోట్ల మంది జనాభా కలిగిన కర్ణాటక రాష్ట్రానికి అస్పృశ్య జాతులకుచెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేవరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చలవాది సంఘం వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరాం పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలోని బీడీఏఏ మైదానంలో జిల్లా స్థాయి దళిత ముఖ్యమంత్రి జనాందోళన క్రియా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్య తాను కూడా దళితుడేనని పేర్కొన్నారని, ఆయన సీఎం కుర్చీని వదిలేందుకు ఇష్టం లేక ఇలా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సరికొత్త డిక్లరేషన్ చేస్తున్నామని, అస్పృశ్య జాతులకు చెందిన వ్యక్తినే సీఎం కావాలని కోరుకుంటున్నామని, సీఎం సిద్ధరామయ్య అస్పృశ్య జాతులకు చెందిన వారైతే బహిరంగంగా చెప్పాలన్నారు. అంటరాని కులానికి చెందిన వారి బాధలు, అవమానాలు సిద్ధరామయ్యకు ఏమి తెలుసునని ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య ఒరిజినల్ కాంగ్రెస్‌వాది కాదన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వలస పక్షి అన్నారు. సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు చామరాజ నగర్ నుంచి పోటీ చేస్తే అక్కడ దళితులు ఏకమై సిద్ధరామయ్యను గెలిపించారన్నారు.
అదే దళితుడు డాక్టర్ జి.పరమేశ్వర్ ముఖ్యమంత్రి అవుతారనే అసూయతో ఆయన్ను ఓడించారని నిప్పులు చెరిగారు. హైకమాండ్ జోక్యం చేసుకుని దళితులకు సీఎం స్థానం కట్టబెడితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కష్టం దళితులది, అధికారం సిద్ధరామయ్య అనుభవించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళిత సంఘర్ష నేతలు మాట్లాడుతూ సీఎం కుర్చీ సిద్ధరామయ్య అబ్బ సొత్తు కాదని, ఆయన వెంటనే సీఎం కుర్చీ వ దలకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎన్.మూర్తి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ప్రధానమంత్రిని చేయడంలో కాని, పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను నియమించడంలో కానీ దళిత వ్యతిరేకిగా ముద్ర వేసుకుందని ఆయన పేర్కొన్నారు.
బాబు జగ్జీవన్‌రాం ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు రాష్ట్రాల్లో దళితులు సీఎం కుర్చీలో కూర్చోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సహకరించడం లేదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో దళితుడు సీఎం కావాలని ఆరు కోట్ల మంది కన్నడిగులు కోరుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు చెవికెక్కడం లేదన్నారు. సీఎం సిద్ధరామయ్య తక్షణం ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోతే ఆయన్ను దళితులు ఎంతో గౌరవిస్తారన్నారు.
దళితులంతా ఏకమై తమ సత్తా ఏమిటో చూపిద్దామని పిలుపునిచ్చారు. బళ్లారిలో ప్రారంభమైన ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాటం చేస్తామని, దళిత కులానికి చెందిన వారిని సీఎంగా కూర్చొబెట్టే వరకు నిద్రపోమన్నారు. మాల, మాదిగలు కలిసికట్టుగా ఉంటే కర్ణాటక రాష్ట్రంలో ఇతర కులాల వారికి సీఎం కుర్చీ దక్కే అవకాశం లేదన్నారు. దళితులను ఏకం చేస్తూ చలో బెంగళూరు, చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. దళిత సంఘర్షణ సమితి, చలవాది సంఘంతోపాటు దళిత కులానికి చెందిన పలు ఉపకులాల నేతలు పాల్గొన్నారు.