సింగపూర్‌లో సైమా అవార్డుల హంగామా
చెన్నై : ఈ సారి సైమా అవార్డుల హంగామా సింగపూర్‌లో జరగనుంది. ప్రతి ఏటా జరుగుతున్న దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన దక్షిణాది భాషలకు చెందిన ఉత్తమ కళాకారులకు అందించే సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జూన్ 30, జూలై ఒకటో తేదీన సింగపూర్‌లో బ్రహ్మాండంగా జరుగనుంది. సినిమా రంగానికి చెందిన 19 విభాగాల్లోని కళాకారులకు ఈ అవార్డులను అందించనున్నారు. 2015లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నారు.
ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక మౌంట్‌రోడ్డులో గల ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. ఈ సమావేశంలో నటి కుష్బు, నటుడు జయం రవి, రానా దగ్గుబాటి, దేవీశ్రీప్రసాద్, వేదిక, నిక్కీగల్రాణి పాల్గొన్నారు.
కుష్బు మాట్లాడుతూ... దక్షిణ భారతీయ సినిమా చాలా గౌరవంగా భావించే అవార్డులు ఈ సైమా అవార్డులన్నారు. ఉత్తమ చిత్రాలను,కళాకారులను ఎంపిక చేసి ఈ అవార్డులను అందిస్తున్నారని నిర్వహాకులను ప్రశంసించారు. అలాగే జయం రవి ఈ సారి సైమా అవార్డు అందుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తన చిరకాల మిత్రుడు జయం రవిని ఈ వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
సైమా అవార్టులను గెలుచుకునే కళాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ తెలిపారు. ఈ సారి సైమా అవార్డులను గతంలో కంటే బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు బృందాప్రసాద్ పేర్కొన్నారు. పలువురు సినీ కళాకారులు ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఆటాపాటా అంటూ ఈ కార్యక్రమం సింగపూర్ సినీ అభిమానులను అలరించనుందని ఆయన అన్నారు.