స్మగ్లింగ్‌ జోరు | Smaligling senter in Chennai | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్‌ జోరు

Published Mon, Jul 24 2017 4:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

స్మగ్లింగ్‌ జోరు

స్మగ్లింగ్‌ జోరు

సంఘ విద్రోహ శక్తులు సముద్ర తీరాన్ని రాజమార్గంగా ఎంపిక చేసుకుని దేశంలోకి ప్రవేశిస్తున్నాయి.

విదేశాల నుంచి బంగారం
మాదక ద్రవ్యాలు కూడా
రాజమార్గంగా సముద్ర తీరం

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళ రాజధాని నగరం చెన్నై కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఇటీవల ఇక్కడ వెలుగుచూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సంఘ విద్రోహశక్తుల కదలికలు ఓవైపు వెలుగులోకి వస్తుంటే, మరోవైపు  బంగారం, మాదక ద్రవ్యాల  స్మగ్లింగ్‌ జోరందుకుంది. ఆదివారం కూడా పది కేజీల బంగారం పట్టుబడటం గమనార్హం.

సాక్షి, చెన్నై: సంఘ విద్రోహ శక్తులు సముద్ర తీరాన్ని రాజమార్గంగా ఎంపిక చేసుకుని దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. అలాగే, అదే తీరం గుండా బంగారం, మాదక ద్రవ్యాలను తరలిస్తుండటం ఇటీవల కాలంగా పెరుగుతోంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఆశతో ఉన్న వారిని ఎంపిక చేసుకుని, తమ ఏజెంట్ల ద్వారా స్మగ్లింగ్‌ను జోరుగా సాగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలు, హార్బర్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతి, బంగారం స్మగ్లింగ్‌ భరతం పట్టే దిశగా తనిఖీల పర్వం సాగుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక విమానాశ్రయంలో బంగారం పట్టుబడడం పరిపాటిగా మారింది. 2012–13తో పోల్చితే గత ఏడాది ఐదింతల మేరకు బంగారం పట్టుబడ్డట్టు గణాంకాలు చెబుతున్నాయి. మలేషియా, సింగపూర్‌లతో పాటుగా అరబ్‌ దేశాల నుంచి విమానాల ద్వారా బంగారం జోరుగా ఇక్కడికి తరలి వస్తోందని చెప్పవచ్చు.

అదే సమయంలో పట్టుబడుతున్న బంగారం ట్రెజరీలకు పరిమితం చేస్తున్నారని, తదుపరి విచారణ అనేది లేని దృష్ట్యా, మళ్లీ మళ్లీ స్మగ్లర్లు తమ ఏజెంట్ల ద్వారా పనితనాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక, చెన్నైలోనే కాకుండా తూత్తుకుడి, రామేశ్వరం, నాగపట్నం హార్బర్లను కేంద్రంగా చేసుకుని బంగారంతో పాటు మాదక ద్రవ్యాల తరలింపు జోరందుకుంటోందనే ఆరోపణలున్నాయి. శ్రీలంక నుంచి హార్బర్ల మీదుగా తమిళనాడులోకి, ఇక్కడి ఏజెంట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు బంగారం, వివిధ రకాల మత్తు పదార్థాలు యథేచ్ఛగా తరలుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. గత కొన్ని రోజుల వ్యవధిలో సముద్ర తీరం గుండా రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున బంగారం ప్రవేశించినట్టు సంకేతాలు వెలువడుతుండటంతో కస్టమ్స్‌ వర్గాలు నిఘాను పెంచి ఉన్నాయి. ఈ నిఘా మేరకు ఆదివారం పది కేజీల బంగారం పట్టుబడటం గమనార్హం.

పది కేజీల బంగారం – నలుగురి అరెస్టు :
రామనాథపురం–శివగంగై–తూత్తుకుడి సరిహద్దుల్లోని కొన్ని గ్రామాలను కేంద్రంగా చేసుకుని శ్రీలంక నుంచి బంగారం స్మగ్లింగ్‌ అవుతుండటాన్ని అధికారులు గుర్తించారు. సాయల్‌ గుడి వైపుగా వస్తున్న వాహనాల్ని తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందం సిద్ధం అయింది. శనివారం రాత్రి నుంచి సాగిన తనిఖీల్లో ఆదివారం వేకువజామున అటు వైపు వచ్చిన నాలుగు మోటార్‌ సైకిళ్లను తనిఖీ చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా, అనుమానం రావడంతో ఆ వ్యక్తుల వద్ద ఉన్న చిన్న పాటి పార్శిళ్లను విప్పి చూడగా, అందులో ఒక్కో కేజీ బరువు కల్గిన బంగారం బిస్కెట్లు పది బయటపడ్డాయి.

మొత్తం పది కేజీలుగా తేల్చారు. వాటి విలువ రూ. మూడు కోట్లు ఉంటుందని నిర్ధారించారు. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీలంక నుంచి వచ్చిన ఈబంగారాన్ని చెన్నైకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తేలింది. చెన్నైలోని ఓ బడా బాబుద్వారా ఈ బంగారం హవాల నగదుగా మారి మళ్లీ శ్రీలంకకు చేరుతుందంటూ ఆ వ్యక్తులు ఇచ్చిన సమాచారం కస్టమ్స్‌ వర్గాలకు షాక్‌ ఇచ్చాయి. ఇక్కడ బంగారం మీద మోజు మరీ ఎక్కువ ఉండటంతో దొడ్ది దారిని తరలించి, దానిని హవాల నగదు రూపంలో మళ్లీ శ్రీలంకకు పంపిస్తున్న ఆ బడా బాబు భరతం పట్టేందుకు చెన్నైలో విచారణ జరుపుతున్నారు. దీన్నిబట్టి చూస్తే, చెన్నై కేంద్రంగా చాప కింద నీరులా స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement