ఇసుక లారీలో నుంచి జంప్ చేసిన నాగుపాము పెట్రోల్ బంక్ వద్ద నిలిపి వున్న స్కూటీలో దాక్కోవడంతో పామును పట్టుకోవడానికి దాదాపు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.
తిరువళ్లూరు: ఇసుక లారీలో నుంచి జంప్ చేసిన నాగుపాము పెట్రోల్ బంక్ వద్ద నిలిపి వున్న స్కూటీలో దాక్కోవడంతో పామును పట్టుకోవడానికి దాదాపు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఇసుక లారీ తిరువళ్లూరు వైపు బయల్దేరింది అయితే ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో పెట్రోల్ బంక్ వద్ద ఆగింది.
ఇదే సమయంలో ఇసుక లారీ నుంచి ఓ నాగుపాము కింద పడింది. అక్కడ జనసంచారం ఎక్కువగా వుండడంతో పామును చూడగానే జనం కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో రోడ్డుపై పడిన పక్కనే వున్న స్కూటీలో దాక్కుంది. కొందరు యువకులు స్కూటీ లో దాక్కున్న పామును బయటకు రప్పించడానికి ప్రయత్నించి విఫలయ్యారు. ఇక చేసేదేమీ లేక తిరువళ్లూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్కూటీలో వున్న పామును పట్టుకోవడానికి వారు సకల ప్రయత్నాలు చేశారు. ద్విచ క్ర వాహనాన్ని కింద పడేసి అటు ఇటూ పొర్లించినా పాము బయటకురాలేదు.దీంతో పోలీసులు వాటర్ క్యాన్‌ను ప్రయోగించడంతో నీటి వేగాన్ని తట్టుకోలేక నాగుపాము బయటకు వచ్చింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది పామును సజీవంగా పట్టుకున్నారు.