వాట్సాప్ రచ్చ ఏడేళ్ల జైలు శిక్ష
సాక్షి, చెన్నై : వాట్సాప్‌లో ఇటీవల కాలంగా సంచలన సమాచారంతో పాటుగా, అసభ్యకరమైన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై కొరడా ఝుళిపించేందుకు నగర పోలీసు యంత్రాంగం సిద్ధం అయింది. అసభ్యకర ఫొటోలు, వీడియోలు, ఎస్‌ఎంఎస్‌లు వాట్సాప్ ద్వారా పంపిన పక్షంలో ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని చెన్నై పోలీసుల కమిషనరేట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆధునిక యుగంలో టెక్నాలజీ విస్తరించే కొద్ది సరికొత్త సోషల్ నెట్ వర్క్‌లు పుట్టుకు వస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రాచుర్యంలో ఉండగానే వాట్సాప్ రంగంలోకి దిగింది. ఆండ్రాయిడ్, తదితర మొబైల్స్‌లోని సదుపాయాల మేరకు కొత్త రకంగా సమాచారం, సోషల్ నెట్ వర్కింగ్ వ్యవహారాలు సాగుతున్నాయి.
అయితే, వీటిని కొందరు అసభ్యకర సంకేతాలకు ఉపయోగించే పనిలో పడ్డారు. అయితే, ఇన్నాళ్లు వీటి మీద పెద్దగా దృష్టి పెట్టని నగర పోలీసు కమిషనరేట్ వర్గాలు, తాజాగా కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయ్యాయి. ఇందుకు కారణం, తమ పోలీసు అధికారి ఫోన్లో ప్రేమ లీల హల్‌చల్ చేసింది వాట్సాప్‌లో కాబట్టే. మరో మహిళా అధికారి బెదిరింపు వ్యవహారం వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతోంది. ఎక్కడి నుంచి ఎవరు పంపిస్తున్నారో ఏమోగానీ, తమ మీద బురదజల్లే రీతిలో వాట్సాప్‌లో ప్రచారాలు సాగుతుండడంతో ఇక, అసభ్యకర సందేశాలు, ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో ప్రత్యక్షమైనా, ఎవరైనా ఫిర్యాదు చేసినా కొరడా ఝుళిపించే విధంగా పోలీసు బాసులు నిర్ణయించారు.
ఏడేళ్లు జైలు శిక్ష : వాట్సాప్‌లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై కన్నెర్ర చేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరి వాట్సాప్ నెంబర్లకైనా అసభ్యకర సందేశాలు, ఫొటోలు, వీడియోలు వచ్చినా తమకు ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పిలుపునిస్తున్నారు. ఒకరి వ్యక్తిగత విషయాలు, ఒకరి ఫొటోలను మరొకరు వాట్సాప్‌లలో పంపించడం, తదితర చర్యలకు పాల్పడ్డ పక్షంలో సైబర్ క్రైంను తక్షణం ఆశ్రయించాలని సూచిస్తున్నారు. తమకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా తదుపరి చర్యల అనంతరం సంబంధిత వ్యక్తులపై ఏడేళ్ల జైలు శిక్ష విధించే రీతిలో కేసులు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంగా ఓ పోలీసు అధికారి పేర్కొంటూ, వాట్సాప్‌లలో వాయిస్ రికార్డులు, వీడియోలు, ఇలా తమ వాళ్లను టార్గెట్ చేసి ఇష్టా రాజ్యంగా ప్రచారాలు సాగుతుండడాన్ని తీవ్రంగా పరిగణించామని పేర్కొనడం గమనార్హం. ఏదేని అసభ్యకరంగా వ్యవహరించే సందేశాలు, ఫొటోలు, వీడియోలు ప్రత్యక్షమైతే చాలు చర్యలు తప్పదని హెచ్చరించారు.