విద్యుత్ సమస్యలనుంచి బయటపడటానికి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే మార్గమని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు సౌర విద్యుత్‌పై అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో సాధ్యమైనంత మేరకు సౌరవిద్యుత్ ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్లాంట్ల ఏర్పాటుకు రాయితీలు, సబ్సిడీలు ప్రకటించి, ప్రజలను ఆకర్షించేందుకు యత్నిస్తోంది. కాగా, రాష్ర్టంలో సౌర విద్యుత్ సేవలను అందరికంటే ముందు పొందేందుకు నాందేడ్ సిద్ధమవుతోంది.
సాక్షి, ముంబై: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, కొరతను తట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా నగరాలలో బహుళ అంతస్తుల భవనాలు, టవర్లలో నివాసముంటున్న వారికి సౌర (సోలార్) విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఒక బృందాన్ని నియమించాలని విద్యుత్ శాఖ యోచిస్తోంది. ఈ భవనాల టెర్రెస్‌లపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే సొసైటీలకు వివిధ రాయితీలు, వీటి ఏర్పాటుకయ్యే వ్యయంలో సబ్సిడీ ఇవ్వాలనే పథకానికి శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది.
దీనికి సంబంధించిన ప్రతిపాదనపై రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో అధ్యయనంచేసే పనులు త్వరలో ప్రారంభించనుంది. అంతా సవ్యంగా సాగితే రాష్ట్రంలోని అనేక నగరాల్లో సౌర విద్యుత్ వాడకం పెరుగుతుంది. దీంతో రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న విద్యుత్ కొరత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా ఉంది. దీనికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి లేదు. ఫలితంగా అనేక గ్రామీణ, పల్లె ప్రాంతాల్లో అత్యధిక శాతం లోడ్‌షెడ్డింగ్ విధించాల్సి వస్తోంది. ముఖ్యంగా విద్యుత్ వినియోగం పట్టణాల్లో, నగరాల్లోనే అత్యధికంగా ఉంటుంది.
కాని పల్లెలు, గ్రామాల్లో విద్యుత్ కోతలు అధికంగా ఉండటం బాధాకరం. చిన్న, కుటీర పరిశ్రమలపై దీని ప్రభావం విపరీతంగా పడుతోంది. విద్యుత్ కోతవల్ల ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయి వీటిపై ఆధారపడిన అనేక పేద కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో తేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సౌర విద్యుత్ ప్లాంట్లను తాముంటున్న భవనాల టైలపై ఏర్పాటు చేసుకునేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘మహారాష్ట్ర ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ’ ఒక కార్యక్రమం రూపొందించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో, ప్రధాన పట్టణాలో అవగాహన సదస్సులు ఏర్పాటుచేయనుంది. ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఈ సదస్సులను నాందేడ్, పుణే యూనివర్సిటీల్లో ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సౌర విద్యుత్ పథకం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే 50 శాతం నిధులు, ప్రైవేటు సంస్థలకు 25 శాతం నిధులు అందజేస్తుంది.
ఇదే తరహాలో పెద్ద నగరాలలో టవర్లు, నివాస సముదాయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తే ప్రత్యేక సబ్సిడీ ఇవ్వనుంది. రాష్ట్రంలో సౌర విద్యుత్‌ను వినియోగించే నగరాలు, పట్టణాలలో నాందేడ్ ప్రథమ స్థానం దక్కించుకోనుంది. ఇక్కడ గురుద్వార్‌తోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీ, ప్రముఖ కాలనీలు, కాంప్లెక్స్‌లలో త్వరలో సౌర విద్యుత్ వెలుగులు కనిపించనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనులు వేగవంతంగా సాగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి డి.పి.సావంత్ చెప్పారు.
సోలార్ వెలుగులే దిక్కు!
Published Wed, Sep 11 2013 12:32 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement