
సైనికులకు రాఖీలు కట్టడం చరిత్రలో ప్రథమం
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
హిందూపురం అర్బన్ : దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు కేంద్ర మహిళా మంత్రులు రాఖీలు కట్టి వేడుకలు చేసుకోవడం దేశ చరిత్రలోనే ప్రథమమని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా మంగళవారం ఆమె కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా విదురాశ్వత్థంలో పర్యటించారు. ఇక్కడున్న స్వాతంత్య్ర సమరయోధుల సమాధులను సందర్శించి.. నివాళులర్పించారు. వారి త్యాగాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకలను ప్రభుత్వం, ప్రజలు ఉత్సవంలా నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. ప్రధాని ప్రోత్సాహంతోనే మహిళా మంత్రులు సైనికులకు రాఖీలు కట్టారని గుర్తుచేశారు. 1938 ఏప్రిల్ 25న విదురాశ్వత్థం వాసులు సంఘటితమై బ్రిటీష్ పాలకులను ధిక్కరించినట్లు వివరించారు. ఈ సందర్భంగా సుమారు 35 మంది నేలకొరిగారని, అందుకే ఈ ప్రాంతానికి దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్ అని పేరొచ్చిందని చెప్పారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బెంగళూరు ఎంపీ పీసీ మోహన్, బీజేపీ రాష్ట్ర నేతలు రవికుమార్, నరసింహారెడ్డి, చిక్‌బళ్లాపురం జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.