సాక్షి, ముంబై: నగరవాసులకు విద్యుత్ సరఫరా చేస్తున్న బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్(బెస్ట్)కు టాటా చెప్పేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. కారణం సుప్రీంకోర్టు ఆదేశాలతో నగరవాసులకు త్వరలో ‘టాటా పవర్’ అందుబాటులోకి రానుంది. ప్రత్యేకించి దక్షిణ ముంబై వాసులకు ఈ టాటా పవర్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటిదాకా విద్యుత్ బిల్లుల విషయంలో బెస్ట్ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. బెస్ట్ సంస్థ ఒక్కటే సరఫరా చేస్తుండడంతో చార్జీలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. తమ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని కోరుతూ బెస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెస్ట్‌తోపాటు ఇక్కడ ఎవరైనా(టాటా) విద్యుత్ సరఫరా చేసుకోవచ్చని తీర్పునివ్వడంతో బెస్ట్‌కు చుక్కెదురైంది. సరఫరాదారుల మధ్య ఇకపై పోటీ పెరుగుతుందని, టాటా పవర్ తక్కువ ధరకే లభించనుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో నగరవాసులపై విద్యుత్ భారం కూడా కొంతమేర తగ్గడమేకాకుండా నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది.
టాటావైపు మొగ్గు...
ముంబైలో విద్యుత్ సరఫరా చేసే బెస్టుకు ప్రత్యామ్నాయంగా టాటా విద్యుత్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అందరూ అటువైపే మొగ్గుచూపుతున్నారు. భారీ ఎత్తున విద్యుత్‌ను వినియోగించే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, హోటల్స్, కార్యాలయాలు కూడా టాటా విద్యుత్‌వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం విద్యుత్ చార్జీలను పరిశీలించినట్టయితే.. బెస్ట్ చార్జీలకంటే టాటా పవర్ కంపెనీ విద్యుత్ చార్జీలు యూనిట్‌కు సుమారు రూ. 1.25 నుంచి రూ. 3.00 వరకు తక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం గృహ వినియోగదారులకు బెస్ట్ మొదటి 100 యూనిట్ల వరకు రూ.3.20 చొప్పున ప్రతి యూనిట్‌కు వసూలు చేస్తుండగా టాటా పవర్ కంపెనీ మొదటి 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్‌కు కేవలం రూ.2.49 మాత్రమే వసూలు చేస్తోంది. ఇక 100 నుంచి 300 యూనిట్ల వరకు బెస్ట్ ప్రతి యూనిట్‌కు రూ.6.38 వసూలు చేస్తుండగా టాటా కేవలం రూ.4.13 వసూలు చేస్తోంది. 500 యూనిట్లు ఆపై వినియోగదారుల నుంచి బెస్ట్ ప్రతి యూనిట్‌కు రూ.11.40 వసూలు చేస్తుండగా టాటా మాత్రం కేవలం రూ. 9.09 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టాటా విద్యుత్ అందుబాటులోకి రానుండడంతో అటువైపే నగరవాసులు ఆకర్షితులు అయ్యే అవకాశముందని చెబుతున్నారు.
బెస్ట్‌కు మరిన్ని ఇబ్బందులు..?
సుప్రీం కోర్టు తీర్పుతో భవిష్యత్తులో బెస్ట్ సంస్థకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. సంస్థ ఆర్థిక వ్యవస్థపై ఈ తీర్పు ప్రభావం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బెస్ట్‌ను టాటా రాకతో అనేక మంది వినియోగదారులు వీడడం ఖాయంగా కన్పిస్తోంది. బస్సు సేవల్లో బెస్ట్‌కు ప్రతి సంవత్సరం సుమారు రూ.600 నుంచి రూ.700 కోట్ల నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు బెస్ట్ విద్యుత్ వినియోగదారులపై ప్రతి యూనిట్‌పై రూ.0.55 నుంచి రూ. రూ.2.00 అదనపు భారాన్ని మోపుతోంది. దీంతో విద్యుత్ విభాగం పెద్ద ఎత్తున లాభాలబాటలో ఉంది. అయితే బెస్ట్ విధించే చార్జీలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో చౌకగా అందుబాటులోకి రానున్న టాటా విద్యుత్ వైపు వినియోగదారులు ఆసక్తి చూపినట్లయితే బెస్ట్ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని సంస్థలోని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
చార్జీలు పెంచుతాం: బెస్ట్
బెస్ట్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఏ సంస్థకైనా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. అయితే నగరవాసులు సంతోషాన్ని ఆవిరి చేస్తూ బెస్ట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి 300 లోపు యూనిట్ల వినియోగదారుల చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించింది. టాటా పవర్ సరఫరా కావడానికి సమయం పడుతుందని చెప్పింది.
బెస్ట్‌కు ‘టాటా’..!
Published Fri, May 9 2014 11:03 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement