చెన్నై, సాక్షి ప్రతినిధి: దశాబ్దాల కాలంగా నలుగుతున్న శ్రీలంక సమస్యకు కొత్త ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని తమిళనాడు మత్స్యకారుల బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు -శ్రీలంక మధ్య శ్రీలంకలో సాగిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్ర ప్రతినిధి బృందం బుధవారం చెన్నైకి చేరుకుంది. తమిళ జాలర్లు బంగాళాఖాతంలో చేపల వేట సాగిస్తే శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు రాష్ట్ర జాలర్లపై విరుచుకుపడటం వివాదాస్పదమైంది. సాయుధ బలగాలతో లంకసేన చుట్టుముట్టగా నిరాయుధులైన తమిళ జాలర్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. పదుల సంఖ్యలో శ్రీలంక చెరలో మగ్గుతున్నారు. ఈ పరిణామాలు తరచూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
భారత ప్రధాని చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి జయలలిత అనేకసార్లు ఉత్తరాలు రాశారు. ఎట్టకేలకూ ఈ ఏడాది జనవరిలో తొలి దశ చర్చలు చెన్నైలో, రెండో దశ చర్చలు శ్రీలంకలో ఈనెల 12వ తేదీన ప్రారంభించారు. తమిళనాడు మత్స్యశాఖ కార్యదర్శి విజయకుమార్, సంచాలకులు మునినాధన్, సహాయ సంచాలకులు రంగరాజన్, భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి సుచిత్రాదురై, సహాయ కార్యదర్శి జోషి తదితర 9 మంది అధికారులు, మత్స్యకారుల సంఘానికి చెందిన 17 మంది ప్రతినిధులు హాజరయ్యూరు. ఈచర్చలకు శ్రీలంక మత్స్యశాఖ డెరైక్టర్ జనరల్ విమల్ హెడ్డియరాచ్చి నేతృత్వం వహించారు. అయితే చర్చలు సుముఖంగా సాగకపోవడంతో 13వ తేదీనాటి చర్చలను తమిళ జాలర్లు బహిష్కరించి బుధవారం మధ్యాహ్నం శ్రీలంక నుంచి చెన్నైకి చేరుకున్నారు.
జాలర్ల ప్రతినిధి బృందం మీడియాతో మాట్లాడుతూ, తమ డిమాండ్లకు శ్రీలంక జాలర్లు ఓ మోస్తరు అంగీకరించినా అక్కడి ప్రభుత్వాధికారులు అడ్డుతగిలారని ఆరోపించారు. రెండు మడతల వలలు, పడవకు వలలను కట్టి లాక్కుంటూ వెళ్లే విధానం, ఉచ్చు వలలు వినియోగించరాదని తొలిరోజు చర్చల్లో శ్రీలంక జాలర్లు కోరగా తాము రెండింటికి అంగీకరించామని తెలిపారు. రెండు మడతల వలలు, ఉచ్చువలల వినియోగాన్ని వెంటనే ఆపివేస్తామని, అయితే వలలను లాక్కుంటూ వెళ్లే విధానాన్ని నిలిపివేసేందుకు మూడేళ్లు గడువు కావాలని తాము కోరినట్లు తెలిపారు. ఏడాదికి 120 రోజులు చేపల వేట సాగించే తాము 90 రోజులు మాత్రం సరిహద్దుకు ఆవల వేట సాగించేందుకు అనుమతించాలని కూడా కోరినట్లు వారు తెలిపారు.
ఇందుకు సైతం జాలర్లు సరేనంటే అక్కడి అధికారులు ససేమిరా అన్నారని వారు చెప్పారు. నెల లేదా మూడునెలల్లో మళ్లీ చర్చలకు అనుమతిస్తామని శ్రీలంక గడువునిచ్చినట్లు తెలిపారు. దీంతో ఇక చర్చలు అనవసరమని భావించి చెన్నైకి చేరుకున్నామని తెలిపారు. యూపీఏ -1, 2 ప్రభుత్వాలు తమ గోడును సీరియస్‌గా తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల లేదా మూడు నెలల్లో చర్చలను జరిపేందుకు శ్రీలంక సిద్దమైంది, అలాగే అప్పటికి అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం సైతం తమ సమస్య పరిష్కారం పట్ల సామరస్యంగా ముందుకొస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
కొత్త ప్రభుత్వంపైనే కోటి ఆశలు
Published Thu, May 15 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement