సవాల్ | state government rit in supreme court | Sakshi
Sakshi News home page

సవాల్

Published Wed, Mar 5 2014 1:40 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

state government rit in supreme court

  సుప్రీం కోర్టులో రాష్ర్ట ప్రభుత్వం రిట్
  ఆ ఏడుగురి విడుదలకు వినతి
  కేంద్రం అనుమతి అవసరం లేదు
  రాజీవ్ హత్య కేసు వ్యవహారంలో    జయ సర్కారు
 
 సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదల వ్యవహారంలో కేంద్రం పిటిషన్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం కేంద్రానికి లేదని ఆ పిటిషన్‌లో వివరించారు. సంప్రదాయం మేరకు గౌరవ సూచకంగా వారికి తెలియజేయాల్సిన అవసరం మాత్రమే ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును విన్నవించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో పేరరివాలన్, శాంతన్, మురుగన్ ఉరి శిక్ష , నళిని, రాబర్ట్, రవి, జయకుమార్ యావజ్జీవ శిక్ష ఎదుర్కొంటూ వచ్చిన విషయం తెలిసిందే. క్షమాభిక్షల పిటిషన్లలో జాప్యంతో సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువడింది.
 
  ఉరి శిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో శాంతన్, పేరరివాలన్, మురుగన్‌కు విముక్తి కలిగినట్టు అయింది. అదే సమయంలో ఏళ్ల తరబడి వేలూరు జైల్లో మగ్గుతూ వస్తున్న నింధితులకు స్వేచ్చాయుత జీవితాన్ని ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉరి శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సుప్రీం కోర్టు విడుదల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టడం ఓ వరంగా మారింది. రానున్న లోక్‌సభ ఎన్నికలను అస్త్రంగా చేసుకుని తమిళాభిమానాన్ని చూరగొనే రీతిలో ఆ ఏడుగురిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నివేదికను కేంద్రం దృష్టికి పంపింది.
 
 పిటిషన్లు : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం మోకాలొడ్డింది. ప్రభుత్వ నివేదికకు సమాధానం ఇవ్వకుండా, ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ వాదన విన్పించడంతో విడుదలకు బ్రేక్ పడింది. సుప్రీం కోర్టు స్టే కారణంగా ఆ ఏడుగురు  జైళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యూయి. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో పాటుగా కేంద్రంతో ఢీ కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. కేంద్రం పిటిషన్‌ను సవాల్ చేస్తూ మంగళవారం ఉదయం సుప్రీం కోర్టులో రిట్‌పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది.
 
 రిట్ పిటిషన్: రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సుబ్రమణ్య ప్రసాద్ సుప్రీం కోర్టులో ఈ రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. ఉరి శిక్షను రద్దు చేసిన సుప్రీం కోర్టు, విడుదల అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని గుర్తు చేశారు. ఆ మేరకు ఆ ఏడుగురి విడుదలకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని పరిశీలించి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారని వివరించారు. తమ నివేదికకు వివరణ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఆ విషయాన్ని మరచి నేరుగా కోర్టును ఆశ్రయించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉందని, కేంద్రంతో సంప్రదాయ బద్ధంగా, గౌరవ సూచకంగా మాత్రమే వివరణ కోరాల్సి ఉందన్నారు. ఆ ఏడుగురిని విడుదల చే యడానికి లేదా బంధించడానికి కేంద్రానికి ఎలాంటి అధికారాలు లేవని వివరించారు. భార త రాజ్యంగంలోని సెక్షన్ 432, 432ఎ ప్రకారం వారిని విడుదల చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
 
  చట్ట నిబంధనలకు లోబడి వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటే, కోర్టు ద్వారా దాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నించడం విచారకరంగా పేర్కొన్నారు. కేంద్రం తీరును తాము అంగీకరించబోమని, వారు దాఖలు చేసిన పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దానిని తోసి పుచ్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిట్ దాఖలు చేయడంతో ఈలం మద్దతు తమిళ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన మొదటి బెంచ్ గురువారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ అదే రోజు జరుగనుండడంతో, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను అదే రోజు విచారణకు సుప్రీం కోర్టు ప్రధాన బెంచ్ స్వీకరించబోతున్నదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 వినతి: ఇక రాష్ట్రంలోని జైళ్లల్లో మగ్గుతున్న మైనారిటీలను విడుదల చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఉదయం ఇండియ దేశీయ లీగ్ నేతృత్వంలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున సచివాలయూనికి తరలి వచ్చారు. సీఎం జయలలితకు వినతి పత్రం సమర్పించారు. రాజీవ్ హత్యకేసు నిందితుల విడుదలకు చర్యలు తీసుకున్నట్టుగానే, తమ వాళ్ల విడుదలకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో మైనారిటీలను గతంలో అనుమానం పేరుతో, కుట్రల పేరుతో పట్టుకెళ్లి జైళ్లలో బంధించారని వివరించారు. ఆ కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో ఉన్నాయని పేర్కొన్నారు. 16 ఏళ్లకు పైగా జైళ్లల్లో మగ్గుతున్న వారందరినీ విడుదల చేయాలని, ఆ కుటుంబాల్లో ఆనందం నింపాలని విన్నవించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement