ర్యాగింగ్ వేధింపులకు విద్యార్థిని బలి!
కేకే.నగర్(చెన్నై): ర్యాగింగ్ వేధింపులకు ఓ విద్యార్థిని బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల కథనం మేరకు.. తమిళనాడు, నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని చిన్నకరుంపాళం ప్రాంతానికి చెందిన రాజా, జయలక్ష్మి దంపతుల కుమార్తె ప్రీతి(17). ఈరోడ్ జిల్లా సత్యమంగళం ప్రైవేటు కళాశాలలో సీఏ కోర్సులో గత నెల 22న చేరింది.
అదే నెల 25న కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ విషయమై ప్రీతి తల్లిదండ్రులు గురువారం సత్యమంగళం పోలీసులు, ఆర్‌డీవోకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణమని, హాస్టల్లో ఆమెను అన్నం తిననివ్వకుండా, నిద్ర పోనివ్వకుండా హింసించారని, రాత్రి రెండు గంటలకు తల స్నానం చేసి రమ్మని, తడిగుడ్డలతో వానలో నిలబెట్టి చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు.
ఈ విషయాలు ఆమె స్నేహితుల ద్వారా తెలిశాయన్నారు. గతనెల 25వ తేదీన చలి, జ్వరం ఉందంటూ హాస్టల్ నిర్వాహకులు ప్రీతిని కోయంబత్తూరు సత్యమంగళం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారని, తాము బయలుదేరిన కొంత సేపటికే హాస్టల్ వార్డెన్ కోయంబత్తూరు వైద్య కళాశాలకు రమ్మని ఫోన్ కట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రీతి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై విచారణ చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. ఆర్‌డీవో స్పందిస్తూ.. విచారణ కమిటీ వేసి, నిజాలు నిగ్గుతేల్చుతామని హామీ ఇచ్చారు.