విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో సుఖం లభిస్తుందని బెళగావికి చెందిన విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ హెచ్‌జీ శేఖరప్ప అన్నారు.
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో సుఖం లభిస్తుందని బెళగావికి చెందిన విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ హెచ్‌జీ శేఖరప్ప అన్నారు. ఆయన ఆది వారం రావ్ బహుద్దూర్ వై.మహాబలేశ్వరప్ప ఇం జనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్నారని, వారి కలలను నిజం చేసే దిశగా విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభను చూపి నిజం చేయాలన్నారు.
ఉత్తర కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతి పెద్దదని తెలిపారు. ఈ వర్సిటీ పరిధిలో 204 ఇంజనీరింగ్ కళాశాలలు, దాదాపు 4,50,000 మంది విద్యార్థులు ఉన్నారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయంలోని 32 విభాగాలున్నాయని, అన్ని విభాగాలకు సరిసమానమైన ప్రాధాన్యత కలిగి ప్రతి ఒక్కరికీ ఉ ద్యోగం లభించే అవకాశాలున్నాయన్నారు. వచ్చే ఏడాదిలో విద్యార్థుల బుద్ధి వికాసం పెంపొందించేందుకు కొత్త సిలబస్, కొత్త ప్రశ్నాపత్రిక ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి 85 శాతం అటెండెన్స్ ఉండేలా కళాశాలలకు హాజరు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు అల్లం గురు బసవరాజు అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షుడు కేఎం మహేశ్వరస్వామి, కార్యదర్శి హెచ్‌ఎం గురుసిద్దస్వామి, సహకార్యదర్శి నేపాక్షప్ప, కోశాధికారి హిమంత్‌రాజు, పాలన మండలి అధ్యక్షుడు డీవీ.బసవరాజు, సభ్యులు అల్లం వినాయక, రాజేంద్రకుమార్, ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.