► సుబ్రమణియన్ మృతిపై అనుమానాలెన్నో?
► ఆత్మహత్యేనని పీఎం రిపోర్
► ఐటీ ప్రశ్నలు.. బెదిరింపులే కారణమా?
► మంత్రి స్నేహితుని మృతిపై సర్వత్రా ఉత్కంఠ
► న్యాయ విచారణకు ప్రతిపక్ష నేత స్టాలిన్ డిమాండ్
తమిళనాడు ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణియన్ (52) మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయనది ఆత్మహత్యని కొందరు, కాదు సహజమరణమని మరికొందరు వాదించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా మంత్రి స్నేహితుడి మృతిపై న్యాయ విచారణ జరిపించాల్సిందేనని ప్రతిపక్ష నేత స్టాలిన్ డిమాండ్ చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన కారణంగా రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ టోపీ గుర్తుపై బరిలోకి దిగాడు. రెండాకుల చిహ్నం లేకుండా గెలుపు అసాధ్యమని తేలిపోవడంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డాడు. నగదు, బహుమతులతో ఓటర్లను ఆకట్టుకునే బాధ్యతను మంత్రి విజయభాస్కర్‌కు దినకరన్ అప్పగించాడు.
ఈ సమాచారం ఎన్నికల కమిషన్ చెవినపడడంతో గత నెల 7వ తేదీన ఐటీ అధికారులు మంత్రి విజయభాస్కర్ ఇళ్లు ,కార్యాలయాలు, క్వారీలు, ఆయన అనుచరులు, స్నేహితుల ఇళ్లపై 35 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. మంత్రి, ఆయన సతీమణి రమ్యలను ఐటీ అ«ధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. ఇలా ఐటీ అధికారుల విచారణకు గురైన వారిలో ఈనెల 8వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మంత్రి స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణియన్ కూడా ఒకరు. ఐటీ దాడుల సమయంలో ఆయన విదేశాల్లో ఉండడంతో ఇటీవల చెన్నైకి తిరిగిరాగానే రెండుసార్లు విచారించారు.
ఊపిరాడని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
మంత్రి కేసు విషయంలో ఐటీ అధికారులు సుబ్రమణియన్‌ను కీలకసాక్షిగా భావించి రెండుసార్లు చెన్నైకి పిలిపించుకుని పలు ప్రశ్నలను సంధించారు. మంత్రి సతీమణి నిర్మిస్తున్న కాలేజీ భవన నిర్మాణంపై అనేక ప్రశ్నలను వేసినట్లు సమాచారం. ఆ నిర్మాణంతో తనకు ఎటువంటి సంబంధం లేదని సుబ్రమణియన్ చేసిన వాదనతో అధికారులు ఏకీభవించలేదని తెలుస్తోంది. అంతేగాక సుబ్రమణియన్ బ్యాంకు అకౌంట్లు సీజ్ చేయడంతో ఇతర కాంట్రాక్టు పనులు స్తంభించిపోయాయి. ఈనెల 9వ తేదీన మంగళవారం మరోసారి విచారణకు రావాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున సుబ్రమణియన్ నామక్కల్ జిల్లా సేవిట్టు రంగం»ట్టిలోని తన తోటలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది.
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఐటీ విచారణ తరువాత ఎలా ఉండేవారని సుబ్రమణియన్ భార్య శాంత, కుమార్తె అభిరామి, కుమారుడు శభరీస్‌ను పోలీసులు మంగళవారం విచారించారు. అయినా ముఖ్యమైన ఆధారాలు ఏవీ లభించలేదు. ఆర్కేనగర్‌లో నగదు బట్వాడా, రూ.89 కోట్ల పంపిణీపై ఆధారాలు తదితర అంశాల వివరాలను ఐటీ అధికారులకు చెప్పరాదని సుబ్రమణియన్‌ను కొందరు బెదిరించనట్లు కూడా తెలుస్తుండగా, బెదిరింపులకు గురిచేసిన వారే పథకం ప్రకారం సాక్ష్యాలు లేకుండా ఆయనను హతమార్చి ఉండొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి.
న్యాయవిచారణకు స్టాలిన్ డిమాండ్
మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణియన్ అనుమానాస్పద మృతి, కొడనాడు ఎస్టేట్‌లో హత్య దోపీడి ఉదంతంలో ప్రధాన ముద్దాయి, జయలలిత కారు మాజీ డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలపై న్యాయవిచారణ జరపాల్సిందిగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మంగళవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. సుబ్రమణియన్ ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రూ.89 కోట్ల నగదు బట్వాడా వ్యవహారంలో సుబ్రమణియన్ ప్రముఖ పాత్ర పోషించి ఉండొచ్చని ఐటీశాఖ అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఐటీ విచారణ జరుగుతున్న తరుణంలో సుబ్రమణియన్ మరణం కేసును పూర్తిగా మలుపుతిప్పిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కీలకమైన కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఆయన మరణం అనేక సందేహాలకు తెరలేపినందున న్యాయవిచారణ జరపాలని ఆయన సీఎంను కోరారు. ఇదిలా ఉండగా, స్థిరాస్తుల మోసం కేసులో మంత్రి విజయభాస్కర్ సమీప బంధువులు సుందరం, ధనపాల్‌లకు కోవై నేరవిభాగ న్యాయస్థానం మంగళవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.