
ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్
దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజనీ కాంత్ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. అయిదు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్న ఆయన, తన చిన్నప్పుడు సంచరించిన పలు ప్రాంతాలను మారువేషంలో తిరుగాడారు. విశ్రాంతి కోసమే ఇక్కడకు వచ్చిన ఆయన తన స్నేహితుడు ఉంటున్న రేస్కోర్సు రోడ్డులోని గోల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్లో విడిది చేశారు. గురువారం ఈ విషయాన్ని పసిగట్టిన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని జై రజనీకాంత్...జై జై రజనీకాంత్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలియని చుట్టుపక్కల వారు ఒక్కసారిగా బిత్తరపోయారు.
తర్వాత విషయం తెలుసుకుని వారుకూడా అభిమానుల్లో కలిసిపోయి రజనీకాంత్ను చూసేందుకు ఎగబడ్డారు. చివరకు రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేయటంతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రజనీకాంత్తో ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. కాగా తనకు వీలున్నప్పుడల్లా రజనీకాంత్ బెంగళూరుకు వస్తుంటారు.
ఆయన సోదరుడు, ప్రాణ స్నేహితులు చాలామంది ఇక్కడే ఉన్నారు. దీంతో రజనీ బెంగళూరు వచ్చినప్పుడల్లా అభిమానుల కళ్లుగప్పి మారువేషంలో తాను చిన్నప్పుడు తిరిగిన రోడ్లు, మాస్ హోటల్స్, టిఫిన్ సెంటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అయిదు రోజులు కూడా ఆయన తన స్నేహితులతో కలిసి మారువేషంలో నగర రహదారులపై ఉత్సాహంగా గడిపినట్లు సమాచారం.