దానికి సమయం ఏది?
నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న కథానాయికల పట్టికలో నటి తమన్న చేరారు. అలాగే వయసు పరంగాను రెండున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ 25 ఏళ్ల భామ పదేళ్లలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మూడు పదుల చిత్రాలు చేశారు. వీటిలో అధికంగా టాలీవుడ్ చిత్రాలే ఉండటం, ఈ బ్యూటీని విజయపథంలో కూర్చోబెట్టింది ఆ సినిమాలే కావడం విశేషం. కథానాయకిగానే కాదు, అతిథి పాత్రలు, ఐటమ్‌సాంగ్స్ కూడా ఎలాంటి చింతా లేకుండా ఆడేశారీకాంత. తమిళంలో పైయ్య, తెలుగులో రచ్చ వంటి చిత్రాల్లో వాన పాటలు తడి తడి అందాలు ఆరబోయడానికి వెనుకాడలేదు. తాజాగా నయనతార నాయకిగా నటిస్తున్న తమిళ చిత్రం నన్భేండాలో ఐటమ్ సాంగ్‌లో అందాలమోతతో కుర్రకారుని గిలిగింతలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ పాటలో నటించడానికి నయనతార నిరాకరించడంతో తమన్నతో స్టెప్స్ వేయించనున్నారని కోడంబాక్కం వర్గాల సమాచారం.
తమన్న నటించిన బాలీవుడ్ చిత్రం చాంద్‌సా రోషన్ చెహా చిత్రం మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మరో విషయం ఏమిటంటే పదేళ్లుగా ప్రముఖ నటిగా వెలుగొందుతున్న ఈ అమ్మడి పై పెద్దగా వదంతులు ప్రచారం కాకపోవడం విశేషం. ప్రేమ, దోమా ప్రచారాలకు కూడా తావివ్వలేదనే పేరు సంపాదించుకోవడం సాధారణ విషయం కాదు. ఎవరిని ప్రేమించలేదా? అన్న ప్రశ్నకు తమన్న బదులిస్తూ తనకంత సమయం ఎక్కడుంది అంటున్నారు. ఆమె మాట్లాడుతూ తాను చాలా చిన్న వయసులోనే అంటే ప్లస్1 చదువుకుంటున్న సమయంలోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేశానని తెలిపారు.
ఇంకా చెప్పాలంటే బాల తారగానే నటినవ్వాలని ఆశించానని అన్నారు. అయితే ఆశలన్నీ వాస్తవ రూపం దాల్చవుకదా అన్నారు. అదే విధంగా తాను కళాశాల జీవితాన్ని చాలా కోల్పోయానన్నారు. తొలుత తనకు విజయానందాన్ని కలిగించింది తెలుగు చిత్ర పరిశ్రమఅని వెల్లడించారు. హ్యాపీడేస్ చిత్రంలో లక్కీగా అవకాశం లభించిందని ఆ చిత్రం అనూహ్య ఘన విజయం సాధించి, తన సినీ జీవితాన్నే మార్చేసిందని పొంగిపోయారు. అదే విధంగా తమిళంలో పయ్యా చిత్రం కూడా తనకు మంచి బ్రేక్ నిచ్చిందన్నారు. ఇకపోతే వదంతులను ఎలా తప్పించుకుంటున్నారని అడుగుతున్నారని నిజం చెప్పాలంటే తన జీవితమే సినిమామయం అన్నారు. సినిమాకు చెందిన వారు మినహా ఇతరులెవ్వరితోను తనకు పరిచయాలు లేవని వెల్లడించారు. తన చుట్టూ ఎప్పుడూ సినిమావారే ఉంటారని వారితో కూడా సినిమా విషయాలనే చర్చిస్తుంటానని, ఇతర సమయాల్లో కలవనని తమన్న అన్నారు.