7 లేడీ స్టార్స్
Published Sun, Mar 16 2014 12:54 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM
చిత్ర పరిశ్రమ కూడా ఒక రకంగా పోరుభూమి లాంటిదే. ఎందుకంటే సినిమా పరిశ్రమ అనేది పెద్ద సాగరం వంటింది. పాత నీరు పోయి కొత్త నీరు వస్తున్నట్లు కొత్త వారి ఎంట్రీ సర్వసాధారణం. ఏ పుట్టలో ఏ పాముంటుందో అన్న చందాన ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉంటుందో? ఎవరికి అదృష్టం వరిస్తుందో చెప్పడం కష్టం. అలాంటి వారిని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఏలుతున్నవారు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కథానాయికలకు ఈ బెడద అధికంగా ఉంటుంది. వారానికి నాలుగైదు చిన్న చిత్రాలు తెరపైకి వస్తున్న తరుణంలో ఆయా చిత్రాల్లో అధికశాతం నూతన నాయికలు పరిచయం అవుతున్నారన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లోనూ సుమారు దశాబ్దం కాలంగా తమ ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వస్తున్న సప్త నాయకీమణుల గురించి చూద్దాం. నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, హన్సిక, తమన్నా, సమంత, శ్రుతిహాసన్ దక్షిణాది నేలుతున్న ఆ సెవెన్ లేడీస్టార్స్.
వీరిలో ప్రస్తుతం నెంబర్‌వన్ స్థానం మాత్రం సంచలన తార నయనతారదేనని చెప్పవచ్చు. అయ్యా చిత్రం ద్వారా కోలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈ మాలీవుడ్ బ్యూటీ ప్రతి చిత్రానికి తన నటనను మెరుగుపరచుకుంటూ స్థాయిని పెంచుకుంటూ హీరోయిన్‌గా ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్నారు. మధ్యలో ఆటుపోటులు చాలానే ఎదుర్కొన్నారు. అవి వృత్తిపరంగాను, వ్యక్తిగతంగాను చోటు చేసుకున్నాయి. చాలా క్లిష్టమైన పరిస్థితులను ఈ భామ సునాయాసంగా అధిగమించారనే చెప్పాలి. ముఖ్యంగా ప్రేమ విషయంలో పలుమార్లు విఫలం అయినా మొక్కవోని మనో నిబ్బరంతో తట్టుకున్న నయనతార హీరోయిన్‌గా విజయాల బాట పట్టడం నిజంగా ఆమెను లక్కీ అనే చెప్పాలి. ప్రేమను నమ్మి పెళ్లిపై ఆశతో నటనకు స్వస్తి చెప్పి తాను ఊహించింది జరగక కాస్త నిరాశ నిసృహలకు గురైనా మళ్లీ నటనపై దృష్టి సారించారు.
రీ ఎంట్రీలోను విజయాలు స్వాగతం పలికాయి. రాజారాణి, ఆరంభం, ఇదు కదిర్‌వేలన్ కాదల్ చిత్రాలతో నయన విజయపరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం హిందీలో విజయం సాధించిన కహాని, తమిళం, తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. తమిళంలో ఎండేనీ ఎన్ అన్భే పేరుతోను, తెలుగులో అనామిక పేరుతోను ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం నయనతార కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. అదే విధంగా మాజీ ప్రియుడు శింబుతో ఇదు నమ్మ ఆళు, ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బేండా, జయం రవికి జంటగా జయం రాజా దర్శకత్వంలో ఒక చిత్రంతో పాటు తెలుగులో మరో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
రెండో స్థానం హన్సికదే
కోలీవుడ్ పరంగా చూస్తే రెండవస్థానం బబ్లీగర్ల్ హన్సికదే అని చెప్పక తప్పదు. షూటింగ్‌లో క్రమశిక్షణ పాటించడంలో మేటి నటిగా దర్శక, నిర్మాతల మెప్పు పొందుతున్న ఈ బ్యూటీకి సక్సెస్ రేటు మెండుగానే ఉంది. శింబుతో ప్రేమాయణం అంటూ మధ్యలో కాస్త సంచలనం సృష్టించడంతో కెరీర్ తడబడినా తాజాగా అత్యధిక చిత్రాలు చేస్తున్న పట్టికలో హన్సికనే మొదటిస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో వాలు, వేట్టైమన్నన్, అరణ్మనై, మాన్‌కరాటే, ఉయిరే ఉయిరే, మిగామన్ చిత్రాలతో పాటు తెలుగులో ఫవర్, దుర్గ మొదలగు ఎనిమిది చిత్రాలు చేస్తున్నారు.
చారిత్రక గుర్తింపు
అనుష్క దక్షిణాదిలో అరుంధతి చిత్రం తరువాత తన హవాను కొనసాగిస్తున్నారన్నది నిజం. చారిత్రక చిత్రాల నాయికకు పేటెంట్‌గా మారింది ఈ బెంగుళూరు బ్యూటీ. తెలుగు, తమిళంలో రూపొందుతున్న భారీ చారిత్రాత్మక చిత్రాలు బాహుబలి, రుద్రమదేవిలో అనుష్కనే హీరోయిన్. ఈ చిత్రాల్లో ఈ సాహసనారి నటన చూడటానికి దక్షిణాది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు గ్లామర్‌తో కూడిన మంచి జాయ్‌ఫుల్ పాత్రను తమిళంలో అజిత్ సరసన చేయడానికి సిద్ధం అవుతున్నారు.
మంచి క్రేజ్
కాజల్ అగర్వాల్ విషయానికొస్తే ఈ బ్యూటీకి తమిళంలో తుపాకీ, జిల్లా చిత్రాలు మంచి విష యం సాధించి పెట్టారుు. దీంతో ప్రేక్షకుల్లో తనకు క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సత్తా చాటాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు చిత్రాలు, ఒక తమిళ చిత్రంతో పాటు హిందీలోను రెండు చిత్రాలు చేస్తున్నారు.
కోలీవుడ్‌లో పాగా కోసం...
చెన్నై చిన్నది సమంత టాలీవుడ్‌లో మరో బిజీ హీరోయిన్. యువ హీరోలకు ఈ బ్యూటీ అంటే యమక్రేజ్. అయితే సొంతగడ్డపై పేరు తెచ్చుకోలేదనే కించిత్ ఆవేదన లేకపోలేదు. ప్రస్తుతం ఆమె టైమ్ బాగుందనే చెప్పాలి. తమిళంలో సూర్య సరసన అంజాద్, విజయ్‌కి జంటగా ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలే.
బిజీబిజీ
నటి శ్రుతిహాసన్, తమన్న అగ్రతారల సరసన చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీరంతా తమ స్థానాలను పదిలపరచుకుంటూ క్రేజీగా వెలుగొందుతుంటే వీరి కాల్‌షీట్స్ లభించని దర్శక నిర్మాతలు కొత్త హీరోయిన్ల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
Advertisement
Advertisement