
బీజేపీపై మండిపడ్డ దర్శకుడు
‘నీట్’ను బలవంతంగా రుద్దేందుకు కేంద్ర సర్కారు కుట్ర చేస్తోందని తమిళ దర్శకుడు తంగర్‌బచ్చన్ ఆరోపించారు.
సాక్షి, చెన్నై: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ను బలవంతంగా రుద్దేందుకు కేంద్ర సర్కారు కుట్ర చేస్తోందని తమిళ దర్శకుడు తంగర్‌బచ్చన్ ఆరోపించారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో ఆయన స్పందించారు. బీజేపీ పార్టీ నిజాయితీ రహిత రాజకీయాలు తమిళనాడులో కొంచెం కొంచెం చొరబడుతూ పాల్పడుతున్న నీతిలేని చర్యలకు, ద్రోహానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.
ఇప్పటివరకు తమ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏం జరిగినా ప్రజలు సహించారని, స్వార్థపూరిత రాజకీయ పార్టీలు ఇకనైనా మారాలని కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడు భవిష్యత్ తరాలకు ముప్పు కలిగించే పథకాల్లో ఒక కుట్రే నీట్ అని ఆరోపించారు. ఈ కుట్రను విద్యార్థులు అర్థం చేసుకున్నారని అన్నారు. ఇలాంటి వాటిని సాగనివ్వకుండా చట్టాలు చేసుకునే విధంగా రాజకీయ హక్కును కాపాడడం తమిళ ప్రభుత్వం బాధ్యతని, ఇదే లక్ష్యంగా పోరాటం చేయాలన్నారు. ఇందుకు కుల మతాలు, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు, యువత కలిసి సమైఖ్యంగా పోరాడాలని తంగర్‌బచ్చన్ పిలుపునిచ్చారు.