పదిలో 93.6% | Tamil Nadu Class 10 results announced, 93.6 per cent pass this year | Sakshi
Sakshi News home page

పదిలో 93.6%

Published Thu, May 26 2016 3:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

పదిలో 93.6%

పదిలో 93.6%

సాక్షి, చెన్నై: పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 93.6 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్లస్‌టూ తరహాలో ఈ ఏడాది కూడా బాలికల హవా సాగింది.  రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను ఇద్దరు, రెండో ర్యాంక్‌ను 50 మంది, మూడో ర్యాంక్‌ను 224 మంది విద్యార్థులు  కైవసం చేసుకున్నారు. పలు పాఠ్యాంశాలలో వందకు వంద మార్కులతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు హోరెత్తించారు. ఇక, నిర్బంధం తమిళ విద్యా  విధానం చుట్టుముట్టినా, కోర్టు ఆదేశాలతో పరీక్షల్ని మాతృభాషలో రాసిన తెలుగు విద్యార్థులు తమ సత్తాను చాటుకున్నారు.

రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదమూడు వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. మూల్యాంకణ ప్రక్రియ ముగిసినా, ఎన్నికలు అడ్డురావడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు సర్వం సిద్ధం చేసిన అధికార వర్గాలు బుధవారం ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు ఫలితాలను ప్రకటించారు.

డీపీఐ ఆవరణలో పరీక్షల విభాగం డెరైక్టర్ వసుంధరాదేవి ఫలితాలను విడుదల చేయడంతో పాటు, ర్యాంకుల జాబితాల్ని, పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల మార్కులు, తదితర అంశాల్ని వివరించారు. ఆ మేరకు పది లక్షల 72 వేల 225 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, తొమ్మిది లక్షల 47 వేల 335 మంది ఉత్తీర్ణులయ్యారు.  ఇందులో నాలుగు లక్షల 83 వేల 717 మంది బాలికలు, నాలుగు లక్షల 63 వేల 618 మంది బాలురు ఉన్నారు. ఈ ఏడాది కూడి బాలికల హవా సాగింది. మొత్తంగా 93.6 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.

గత ఏడాది కంటే, ఈ సారి ఒక్కశాతం ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్రంలోనే ఉత్తీర్ణతలో ఈరోడ్ జిల్లా 98.48 శాతంతో తొలి స్థానాన్ని, 98.7 శాతంతో కన్యాకుమారి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక, 86.49 శాతంతో వేలూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
 
ర్యాంకర్లు : ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు, ర్యాంకుల్లోనూ అదే పయనం సాగించారు. తమిళ మాద్యమంలో పరీక్షలు రాసిన వారిలో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్‌ను ఐదు వందలకు గాను 499 మార్కులతో ఇద్దరు కైవసం చేసుకున్నారు. వారిలో విరుదునగర్ జిల్లా పెరియపళ్లికులంలోని నోబల్ స్కూల్ విద్యార్థిఆర్ శివకుమార్, నామక్కల్ జిల్లా రాశిపురం ఎస్‌ఆర్‌వీ -ఎక్స్‌ఎల్ విద్యార్థిని ప్రేమసుధా ఉన్నారు. సీఏ చదువుతానని శివకుమార్ పేర్కొనగా, డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యం అని ప్రేమసుధా వ్యాఖ్యానించారు.

ఇక, రెండో స్థానాన్ని 498 మార్కులతో యాభై మంది, 497 మార్కులతో మూడో స్థానాన్ని 224 మంది విద్యార్థులు దక్కించుకున్నారు. ఇక,  తమిళ పాఠ్యాంశంలో 73 మంది, ఆంగ్లంలో  51 మంది, సైన్స్‌లో 18 వేల 642, గణితంలో  18 వేల 754 మంది, సోషియల్ సైన్స్‌లో 39 వేల 398 మంది వందకు వంద మార్కులతో హోరెత్తించారు. ఇక, అంధ విద్యార్థుల విభాగంలో  ముగ్గురు రాష్ట్రంలో మొదటి రెండు ర్యాంకుల్ని దక్కించుకున్నారు. తిరునల్వేలి జిలా పాళయం కోట్టైలోని అంధుల పాఠశాలకు చెందిన కృష్ణకుమార్ ఐదు వందలకు 489, ఎం రాణి 470 మార్కులు సాధించారు.

రాష్ట్రంలో కేంద్ర కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సైతం సత్తా చాటుకున్నారు. చెన్నై పుళల్ జైలులో  28 మంది ఖైదీలు ఉత్తీర్ణులయ్యారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 70 కార్పొరేషన్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. 6,608 మంది పరీక్ష రాయగా, ఆరు వేల 273 మంది ఉత్తీర్ణులయ్యారు. 99 శాతం మేరకు కార్పొరేషన్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డీఎంకే అధినేత కరుణానిధి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
తెలుగు విద్యార్థుల ప్రతిభ :
నిర్బంధ తమిళం అమల్లో ఉన్న ఈ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు తెలుగు విద్యార్థులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. చివరకు కోర్టు కరుణించి ఇచ్చిన ఆదేశాల్ని అధికార వర్గాలు అమలు చేయడంతో మాతృభాషలో పరీక్షలు రాసి తమ ప్రతిభ చాటుకున్నారు. తెలుగులో పాఠ్యాంశంలో వందకు 90కు పైగా మార్కుల్ని అత్యధిక శాతం మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. ఇక, హోసూరు సమీపంలోని  డెంకణీకోట తాలూక కుందుకోట ప్రభుత్వ తెలుగు ఉన్నత పాఠశాలలో  చదువుతున్న శాలివారానికి చెందిన ఎం.మధుశ్రీ తెలుగు పాఠ్యాంశంలో 98 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement