
జయలలిత మరణంపై నివేదిక ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణానికి గల కారణాలపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు సోమవారం ఆదేశించింది. అమ్మ మృతి మిస్టరీ అని, ఆమె మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు, సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుందర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. జయకు జరిగిన చికిత్స వివరాలను కోర్టుకు సమర్పించేందుకు అపోలో యాజమాన్యం అంగీకరించిందని, ప్రభుత్వం మరికొంతగడువు కోరినందున నాలుగువారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేశారు.