పేరు మార్చండి
అమ్మ టాస్మాక్‌గా మార్చాలని విజయ్‌కాంత్ చురక
నామకరణానికి పట్టు
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని అన్ని టాస్మాక్ మద్యం దుకాణాల పేర్లను మార్చాలని డీఎండీకే అధినేత, ప్రతి పక్ష నేత విజయకాంత్ డిమాండ్ చేశారు. ఈ దుకాణాలకు ‘అమ్మ’టాస్మాక్ అని నామకరణ చేయాలని హితవు పలికారు. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్న విషయం తెలిసిందే. మద్య నిషేధం లక్ష్యంగా కొన్ని పార్టీలు గళం విప్పాయి. ఇందులో డీఎండీకే కూడా ఉంది. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదంతో ముందుకెళ్తోన్న ఆ పార్టీ తాజాగా, ఆ దుకాణాలకు అమ్మ(జయలలిత) పేరు పెట్టాలన్న డిమాడ్‌ను తెర మీదకు తెచ్చింది. ఈ విషయంగా డీఎండీకే అధినేత విజయకాంత్ రెడ్ హిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
విద్యా ప్రదాత కామరాజర్ జయంతిని పురస్కరించుకుని తమ వంతుగా పార్టీ వర్గాలు సేవలు అందించాయని వివరించారు. తాజగా ఇక్కడ పేదలకు కుట్టు మిషన్లు, ఐరన్ బాక్సులు, హెల్మెట్‌ల పంపిణీ జరిగింద న్నారు. విద్యా ప్రదాత కామరాజర్ ప్రజల కోసం శ్రమించారని, పదవులు, పేరుకోసం ఏ మాత్రం కాదన్నారు. అయితే, ఇప్పుడున్న వాళ్లు పదవులు కాపాడుకోవడంతో పాటుగా తమ పేరు స్థిరం కావాలన్న కాంక్షంతో భజనల్ని అందుకుని ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఎక్కడ చూసినా అమ్మ..అమ్మ....అబ్బో తెగ భజన చేస్తున్నారని చురకలు అంటించారు. ఏ టీవీ చూసినా అమ్మ, ఏ బోర్డు చూసినా అమ్మ ...ఇలా ప్రతి ఒక్కరూ ఆ అమ్మ భజనకే పరిమితం అవుతున్నారని, ఆ పథకం తమ అమ్మ ఘనత, ఈ పథకం తమ అమ్మ తీసుకొచ్చిందని జబ్బలు చరస్తున్నారని గుర్తు చేశారు. ఇంత హంగామా చేస్తూ, అమ్మ భజన చేస్తున్న వాళ్లు ,రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం దుకాణాలకు మాత్రం అమ్మ పేరు పెట్టడం మరచినట్టున్నారేనని ఎద్దేవాచేశారు. ఇకనైనా టాస్మాక్ మద్యం దుకాణాలకు అమ్మ టాస్మాక్ అని నామకరణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలంటూ హితవు పలికారు.