
ట్యాక్సీ డ్రైవర్ కిరాతకం
- మద్యం మత్తులో భార్యను హత్య చేసి ఆత్మహత్యాయత్నం
- అనాథలైన చిన్నారులు
- నిందితుడు చిత్తూరు వాసి
బెంగ ళూరు : మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నబిడ్డల ముందే కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన సంఘటన ఇక్కడి చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాలు... ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన తిరుమలేష్ అలియాస్ రమేష్, భార్య శాంతిమణి (33)తో చెన్నమ్మనే అచ్చుకట్ట సమీపంలోని ట్యాంక్ బండ్ ఏరియాలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరికి యతిరాజ్ (7), పునీత్ (3) అనే ఇద్దరు పిల్లలు. రమేష్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల మద్యానికి బానిసైన రమేష్ విధులకు వెళ్లకుండా భార్యను డబ్బుకోసం వేధించేవాడు.
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పీకలదాక మద్యం తాగి వ చ్చిన రమేష్ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సహనం కోల్పోయి కత్తితో పిల్లల ఎదుట భార్యను విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటనతో పిల్లలు ఇద్దరు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నామని బుధవారం చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీసులు తెలిపారు.