ఒంగోలు : వచ్చే సంక్రాంతినాటికి ఒంగోలులో మినీస్టేడియం నిర్మాణం పూర్తవుతుందని స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పేర్కొన్నారు. మినీస్టేడియం నిర్మాణాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి, హ్యాబ్‌టెక్ ఇంజినీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్‌డీవో ఆర్‌కే యతిరాజ్ మాట్లాడుతూ దాత ఆనంద్ ఇచ్చిన విరాళం రూ.60 లక్షలు ఉందని, దాంతో ఇండోర్‌లో షటిల్ వుడెన్ కోర్టులు, డార్మిటరీలు, ఇండోర్‌పైన షీట్ వంటివి ఏర్పాటు చేయాలని వివరించారు.
ఇక అవుట్‌డోర్‌కు సంబంధించి ప్రస్తుతం క్రికెట్ ప్రాక్టీస్ కోసం వేసిన నెట్‌లు ఉన్న ప్రాంతంలో బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మించాలన్నారు. దాంతో పాటు ఇండోర్, అవుట్‌డోర్‌లో టాయిలెట్లు నిర్మించాలన్నారు. స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరైతే స్టేడియం నిర్వహణకు ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. స్విమ్మింగ్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు మీడియాతో మాట్లాడుతూ గతంలో పర్వతరెడ్డి ఆనంద్ కోటి రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. అందులో ఇంకా రూ.60 లక్షలు మిగిలి ఉన్నాయన్నారు. వీటితో రెండు రోజుల్లో ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభిస్తామన్నారు. అవుట్‌డోర్ నిర్మాణానికి రూ.2.20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో గ్రౌండ్‌ను లెవల్ చేసి ఆటలకు అనుకూలంగా తయారుచేస్తామన్నారు. చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచి క్రీడాకారులకు డార్మిటరీ సౌకర్యం, బాస్కెట్‌బాల్, కబడ్డీ, క్రికెట్, ఫుట్‌బాల్ తదితర కోర్టులు నిర్మిస్తామని వివరించారు. ఎమ్మెల్యే వెంట డీఎస్‌డీవో ఆర్‌కే యతిరాజ్, హ్యాబ్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బసవయ్య, అసిస్టెంట్ ఇంజినీర్ పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు.