మీ మహిళలకే రక్షణ లేకపోతే ఎలా?
మీ మహిళలకే రక్షణ లేకపోతే ఎలా?
Published Sat, Dec 24 2016 11:57 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ల అధికారానికి, అవినీతికి ఎవరు అడ్డొచ్చినా బెదిరించడం అలవాటు అయిపోయిందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. మీ సొంత పార్టీ మహిళా నేతలకే రక్షణ లేకపోతే.. ఇక ప్రతిపక్ష పార్టీలలో మహిళలకు, ఇతరులకు ఎక్కడి నుంచి రక్షణ కల్పిస్తారని సూటిగా ప్రశ్నించారు. మాట వినని వారిపై కేసులు పెట్టి వేధించడం టీడీపీకి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. మైనారిటీ వర్గానికి చెందిన మహిళపై దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ ఏం తప్పు చేశారని ఆమెను మంత్రి రావెల అనుచరులు బెదిరించారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆమెపై సొంత పార్టీకి చెందిన మంత్రి దాడి చేయడం దారుణమని అన్నారు. ఆయనను అరెస్టు చేసే ధైర్యం పోలీసులకు ఉందా అని నిలదీశారు. ఇక జానీమూన్ వెనక వైఎస్ఆర్‌సీపీ ఉందని రేపో మాపో చెప్పినా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదని రాంబాబు అన్నారు. మీ పార్టీకి చెందిన మహిళలకే రక్షణ లేనప్పుడు రాష్ట్రంలో ఏ మహిళకు రక్షణ ఉంటుందని నిలదీశారు. అధికారం, డబ్బు, అన్యాయం తప్ప టీడీపీకి మరో ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో నరకాసుర పాలన జరుగుతోందని మండిపడ్డారు. జానీమూన్ ఉదంతంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ శాశ్వతం కారని, ప్రభుత్వాలు మారుతాయని, భవిష్యత్తులో ఒక్క మహిళ కూడా టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదని అంబటి రాంబాబు అన్నారు.
Advertisement