టీడీపీది రోజుకో బాగోతం! | Telangana Minister KTR meets Nitin Gadkari | Sakshi
Sakshi News home page

టీడీపీది రోజుకో బాగోతం!

Published Fri, Jun 19 2015 2:34 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయిన మంత్రి కేటీఆర్ - Sakshi

గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయిన మంత్రి కేటీఆర్

* తెలుగుదేశం పార్టీ వైఖరిపై మంత్రి కేటీఆర్ ధ్వజం
* ‘ఓటుకు కోట్లు’ కేసులో చట్టం తన పని తాను చేస్తుంది..

సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో టీడీపీది రోజుకో మాట, రోజుకో బాగోతం అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఈ కేసులో అడ్డంగా దొరికిపోవడమేకాక ఇతరులపై ఆ పార్టీ నేతలు బురదజల్లుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు, కేసీఆర్‌పై ఏపీలో కేసులు పెట్టడంపై గురువారం ఇక్కడ విలేకరులు కేటీఆర్ స్పందన కోరగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. వాస్తవంగా జరిగిందేమిటో ప్రజలు చూశారన్నారు. ఓటుకు కోట్లు కేసు గురించి అడగ్గా.. చట్టం తన పనితాను చేస్తుందన్నారు.

హైదరాబాద్‌లో ఏడాది నుంచి శాంతిభద్రతల సమస్యలేదని, భవిష్యత్‌లోనూ అలాంటి వాతావరణమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 
వెంకయ్య, గడ్కారీ, రవిశంకర్‌లతో భేటీ
తొలుత కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. స్మార్ట్‌సిటీ, స్మార్ట్ టెక్నాలజీపై ఆగస్టు 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా రావాలని మంత్రి వెంకయ్యను కేటీఆర్ ఆహ్వానించారు. లక్షకు పైగా జనాభా ఉన్న సిద్ధిపేటను క్లాస్-1 పట్టణ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనపై ఈ సందర్భంగా వెంకయ్య సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ హడ్కో చైర్మన్ రవికాంత్‌ను కలసి వాటర్ గ్రిడ్‌కు రూ.5వేల కోట్ల రుణం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
 
జాతీయ రహదారుల స్థాయి కోసం వినతి
రాష్ట్రంలోని వెయ్యి కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచాలని కేటీఆర్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌పోర్టుభవన్‌లో ఆయన గడ్కారీని కలసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి 2 లక్షల  టన్నులు, రహదారులకు 8 లక్షల టన్నుల సిమెంటును రాయితీపై ఇవ్వాలని కోరారు. కాగా, రెండు పడకల గదుల ఇళ్లకు కూడా సిమెంటు రాయితీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని గడ్కారీ సూచించారని కేటీఆర్ తెలిపారు. అనంతరం ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలసి టీహబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించినట్టు కేటీఆర్ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement